టంగ్ స్లిప్పయ్యాక కేసులంటూ బెదిరిస్తోంది

అన్నమయ్య సినిమాలో చిన్న మరదలిగా, భారతీయుడు సినిమాలో చెల్లెలి పాత్రలో అలరించిన కస్తూరి తెలుగు ఆడియన్స్ కు సీరియల్స్ ద్వారా సుపరిచితురాలే. కాని రియల్ లైఫ్‌ లో మాత్రం ఆమె వయస్సు 50కు దగ్గరపడుతున్నా కూడా అప్పుడప్పుడూ హాట్ హాట్ ఫోటో షూట్స్ తో పిచ్చెత్తిస్తుంటుంది. అదంతా పక్కనెడితే, చాలా కాంట్రోవర్షియల్ విషయాల్లో తన ట్విట్టర్ ద్వారా వేలు కాలు పెట్టేసి రచ్చలేపుతుంటుంది కూడాను. నిన్న సడన్ గా సరోగసీ ఇండియాలో అక్రమం, నేనొక లాయర్ గా చెబుతున్నా.. అంటూ పెద్ద హంగామా చేసింది. కాని కథ అంతటితో ఆగలేదు.

నయనతార విఘ్నేష్‌ శివన్ తమకు కవలలు జన్మించారని చెప్పగానే.. ఎలాగో నయనతార ఎక్కడా ప్రెగ్నెంట్ గా కనిపించలేదు కాబట్టి.. ఖచ్చితంగా వీళ్లు సరోగసి ద్వారానే పిల్లలను కనుంటారని అందరూ అనుకున్నారు. ఈ విషయంపై నయన్ అండ్ విక్కి ఇంకా స్పందించకపోయినా కూడా, చాలామంది దీని గురించి చాలారకాలుగా కామెంట్స్ చేయడం మాత్రం ఆపలేదు. వెంటనే ఈ ట్రెండింగ్ టాపిక్ ను పట్టుకున్న కస్తూరి కూడా.. చాలా తెలివిగా లీగల్ గా ఇరుక్కోకుండా.. అసలు నయన్ పేరు వాడకుండా.. సరోగసి సరైనది కాదంటూ ట్వీటేసింది.

దీనితో నయన్ అభిమానులు ఊరుకుంటారా? వెంటనే ఆమెను దారుణంగా ట్రోల్ చేయడం మొదలెట్టేశారు. భర్తతో విడాకులు, హాటుగా రెచ్చిపోవడం, వేరే హీరోయిన్ల పర్సనల్ గొడవల్లో తలదూర్చడం వంటి అంశాలపై ఆమెను ఫుట్ బాల్ ఆడేసుకున్నారు. అంతే కాదు, అసలు నయన్ దంపతులు సరోగసీ ద్వారానే ఎందుకు పిల్లల్ని కన్నారో, లేదంటే వారికేమైనా మెడికల్ సమస్యలు ఉన్నాయేమో నీకు తెలీదుకదా, నోరుపాడేసుకోకు అంటూ కొందరు గట్టిగానే మొట్టికాయలు వేశారు. దాంతో కస్తూరి ఏం చేసిందో తెలుసా?

”అసలు నేను నయన్ అండ్ విఘ్నేష్‌ గురించి మాట్లాడానా? నేను కేవలం సరోగసి గురించి చెప్పానంతే. ఎవరన్నా నా మాటలను నయన్ పిల్లల విషయంతో ముడిపెడితే మాత్రం.. వాళ్ళను కోర్టుకు లాగుతూ. కేసులు పెడతా” అంటూ వెంటనే మరో స్టేట్మెంట్ ఇచ్చింది కస్తూరి.