‘బాషా’ సినిమాతో సూపర్ స్టార్ రజినీకాంత్ రేంజే మారిపోయింది. ఆయన తెలుగులోనూ పెద్ద స్టార్‌గా అవతరించారు. ఇక్కడా తిరుగులేని మార్కెట్ సంపాదించారు. అప్పటికే హిందీ మార్కెట్లో కూడా ఆయనకు మంచి గుర్తింపే ఉంది. ఇక తమిళనాడు సంగతి చెప్పాల్సిన పని లేదు. దీంతో రజినీ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే చాలు.. రికార్డుల మోత మోగడం కామన్ అయిపోయింది. తన రికార్డులను తనే బద్దలు కొడుతూ సాగిపోయారు సూపర్ స్టార్.
‘రోబో’ సినిమాతో ఆయన కెరీర్ పీక్స్ అందుకున్నారు. రజినీకి, మిగతా హీరోలకు అంతరం బాగా పెరిగిపోయింది. కానీ ఈ ఫాలోయింగ్, మార్కెట్ అంతటినీ చేజేతులా దెబ్బ తీసుకున్నాడాయన. ‘కబాలి’ మొదలుకుని ‘అన్నాత్తె’ వరకు ఆయన్నుంచి వరుసగా నిరాశాజనక చిత్రాలే వచ్చాయి. సినిమా సినిమాకూ వసూళ్లు పడిపోతూ వచ్చాయి. రజినీ మార్కెట్ కూడా దెబ్బ తింటూ వచ్చింది. చూస్తుండగానే విజయ్, అజిత్ లాంటి హీరోలు ఆయన్ని దాటేశారు.
‘2.0’కు ఉన్న విపరీతమైన హైప్ వల్ల ఆ సినిమా రికార్డులు కొనసాగుతూ వచ్చాయి కానీ.. ఇప్పుడు ‘పొన్నియన్ సెల్వన్’ వాటికీ పాతర వేసేస్తోంది. యుఎస్‌లో దాదాపు 20 ఏళ్ల నుంచి రజినీ ఎప్పటికప్పుడు కలెక్షన్ల రికార్డులు నెలకొల్పుతూనే ఉన్నారు. తన రికార్డులు తనే బద్దలు కొడుతూ సాగుతున్నారు. ‘2.0’ సినిమా 5.5 మిలియన్ డాలర్లు వసూలు చేసి ఆల్ టైం రికార్డును నెలకొల్పింది. ఇప్పుడు ‘పొన్నియన్ సెల్వన్’ ఆ వసూళ్ల రికార్డును బద్దలు కొట్టేసింది.
20 ఏళ్ల యుఎస్ మార్కెట్లో రజినీ సినిమా కాకుండా వేరే తమిళ చిత్రం నంబర్ వన్ స్థానంలో ఉండడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఐతే ‘2.0’ ఓవరాల్ వసూళ్ల రికార్డును ‘పొన్నియన్ సెల్వన్’ అధిగమించడం కష్టమే కావచ్చు. రజినీ సినిమా రూ.500 కోట్లకు పైగానే వసూళ్లు రాబట్టింది. ‘పొన్నియన్ సెల్వన్’ ఈ మధ్యే రూ.300 కోట్ల మార్కును దాటింది. ఐతే తమిళంలో సంచలన వసూళ్లతో సాగిపోతున్న ఈ చిత్రానికి ‘బాహుబలి’, ‘కేజీఎఫ్’ తరహాలో ఇతర భాషల్లో మంచి స్పందన వచ్చి ఉంటే అలవోకగా ‘2.0’ రికార్డును బద్దలు కొట్టేసేదే.