కొరటాలను వదలని చిరు?


మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో అతి పెద్ద షాక్ అంటే ‘ఆచార్య’ అనే చెప్పాలి. ఆయన కెరీర్లో ఫ్లాపులు, డిజాస్టర్లు లేక కాదు. కానీ ‘ఆచార్య’ వాటన్నింటినీ మించిన పరాభవం. గతంలో చిరు సినిమాలు నిరాశ పరిచినా.. ఆయన వరకు బాగానే ఎంటర్టైన్ చేసేవారు. కానీ ‘ఆచార్య’లో మాత్రం అలా లేదు. ఇక గతంలో చిరు సినిమాలు ఎంత పేలవంగా కనీసం ఓపెనింగ్స్ అయినా వచ్చేవి. దీనికి అదీ లేదు. ఇలా అన్ని రకాలుగా ‘ఆచార్య’ నిరాశకు గురి చేసింది.

ఐతే ఆ ఫెయిల్యూర్ విషయంలో తన బాధ్యతేమీ లేదన్నట్లుగా చిరు మాట్లాడడం విమర్శలకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా దర్శకుడి ఛాయిస్ అని, దర్శకుడు చెప్పినట్లు తాము చేసుకుపోయామని చిరు వ్యాఖ్యానించడం దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇది పరోక్షంగా కొరటాలకు కౌంటర్ అన్నది స్పష్టం. ఈ విషయంలో ఎన్ని విమర్శలు వచ్చినా చిరు ఆలోచన ఏమీ మారినట్లు కనిపించడం లేదు.

తన కొత్త చిత్రం ‘గాడ్ ఫాదర్’ సక్సెస్ మీట్లో చిరు మాట్లాడుతూ.. ఈ చిత్రం ఇంకా మెరుగ్గా తయారవడంలో తన పాత్ర ఉన్నట్లు చిరు చెప్పకనే చెప్పుకున్నారు. పతాక సన్నివేశాల్లో విలన్ పాత్ర బలహీన పడిపోతోందని, దానిపై సానుభూతి వస్తోందని తాను చెప్పడంతో మోహన్ రాజా క్లైమాక్స్‌ను మార్చారని, విడుదలకు పది రోజుల ముందు ఈ సన్నివేశాలు రీషూట్ చేశామని చిరు చెప్పుకున్నారు. తనకున్న అపార అనుభవంతో ఒక ప్రేక్షకుడిలా సినిమా చూసి ఇలాంటి ఇన్‌పుట్స్ ఇస్తుంటానని.. వాటిని స్వీకరిస్తే సినిమాకు మంచి జరుగుతుందన్నట్లుగా చిరు మాట్లాడాడు.

రాఘవేంద్రరావు లాంటి దిగ్గజ దర్శకులతో పని చేసిన రోజుల నుంచి తాను ఇలాగే ఇన్‌పుట్స్ ఇచ్చేవాడినని.. ఇలా కలిసి చర్చించుకుని సినిమాలు సమష్టి కృషితో తీస్తేనే విజయాలు దక్కుతాయని చిరు అన్నారు. మరి ‘ఆచార్య’కు చిరు ఇలాంటి ఇన్‌పుట్స్ ఇవ్వలేకపోయారు, ఆ సినిమాను ఎందుకు కాపాడలేకపోయారనే ప్రశ్న ఆటోమేటిగ్గా ఉదయిస్తుండగా.. కొరటాల తన ఇన్‌పుట్స్ ఏమీ తీసుకోలేదనే సంకేతాలను పరోక్షంగా ఇవ్వడం ద్వారా ఆయన్ని మరోసారి చిరు టార్గెట్ చేశాడేమో అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.