ఆ పాత్రను మన స్టార్ చేసి ఉంటే..


‘గాడ్ ఫాదర్’ సినిమా విడుదలకు ముందు పాజటివిటీ కంటే ఎక్కువగా నెగెటివిటీనే కనిపించింది. అసలు ఈ రోజుల్లో ఒక రీమేక్ సినిమా పట్టాలెక్కడం ఆలస్యం విమర్శలు మొదలైపోతాయి. అందులోనూ ‘గాడ్ ఫాదర్’ ఒరిజినల్ ‘లూసిఫర్’ తెలుగులో అందుబాటులో ఉండడం, అది సగటు మాస్ మసాలా మూవీ కావడం, మన వాళ్లు చాలామంది ఆ సినిమా చూసి ఉండడంతో చిరు ఈ చిత్రాన్ని రీమేక్ చేయడం చాలామందికి రుచించలేదు. అందుకే రిలీజ్ ముంగిట ఈ సినిమాకు పెద్దగా బజ్ కనిపించలేదు. చాలా వరకు నెగెటివిటీ మధ్యే సినిమా థియేటర్లలోకి దిగింది. కానీ తక్కువ అంచనాలతో వచ్చిన ప్రేక్షకులను సినిమా బాగానే మెప్పించింది.

చిరు పెర్ఫామెన్స్, ఒరిజినల్‌కు చేసిన మార్పులు చేర్పులు, తమన్ మాస్ బీజీఎం.. ఇలా సినిమాలో చెప్పుకోవడానికి చాలా హైలైట్లే ఉన్నాయి. ఐతే ఒక్క విషయంలో మాత్రం మెజారిటీ ప్రేక్షకులు నిరాశ చెందారు. అదే.. సల్మాన్ ఖాన్ క్యామియో.

‘గాడ్ ఫాదర్’కు హిందీలో రీచ్ పెంచడం కోసం సల్మాన్‌తో ఈ పాత్ర చేయించి ఉండొచ్చు కానీ.. తెలుగులో మాత్రం ఈ పాత్ర వల్ల అదనపు ప్రయోజనం ఏమీ లేకపోయింది. పైగా సదరు సన్నివేశాలు చప్పగా తయారయ్యాయి. నిజానికి ఒరిజినల్లో ‘లూసిఫర్’ దర్శకుడే అయిన స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ చేసిన ఈ పాత్రకు అక్కడ అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది.

హీరో కష్టాల్లో ఉన్నపుడు ఇంకో స్టార్ హీరో వచ్చి ఆదుకుంటే ఆ సన్నివేశాలు బాగా పండుతాయి. కానీ ఇక్కడ సల్మాన్ ఆ పాత్రను చేయడం మన వల్ల ఏరకమైన ఎగ్జైట్మెంట్ కలగలేదు. ఈ సన్నివేశాల్లో సల్మాన్ స్క్రీన్ ప్రెజెన్స్ ఏమంత బాగా లేదు. ఆయన బదులు పవన్ కళ్యాణ్ లాంటి వాడు ఈ క్యామియో చేసి ఉంటే థియేటర్లు దద్దరిల్లిపోయాయి. పవన్ కాకపోయినా చరణ్, అల్లు అర్జున్ లాంటి మెగా ఫ్యామిలీ హీరోలే ఈ పాత్ర చేసి ఉన్నా రెస్పాన్స్ ఒక రేంజిలో ఉండేది. సినిమా ఇంకో స్థాయికి వెళ్లి ఉండేది అనడంలో సందేహం లేదు.