బాగున్న కంటెంట్ కి బాస్ బ్రేకులు

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక థియేట్రికల్ సినిమాకు పాజిటివ్ టాక్ రావడమంటే అదో పెద్ద అచీవ్ మెంట్ కిందే చెప్పుకోవాలి. అలాంటిది డెబ్యూ హీరో మూవీకి మీడియాతో పాటు ఆడియన్స్ నుంచి కూడా ప్రశంసలు దక్కితే అంతకన్నా కావాల్సింది ఏముంటుంది. కానీ చేతిలో మంచి కంటెంట్ ఉన్నప్పటికీ రిలీజ్ టైమింగ్ ని ఎంత కీలకంగా సెట్ చేసుకోవాలో తాజాగా విడుదలైన స్వాతిముత్యం ఉదాహరణగా నిలుస్తోంది. దసరా పండగను క్యాష్ చేసుకునే ఉద్దేశంతో చిరంజీవి, నాగార్జునలతో ఢీ కొట్టేందుకు సిద్ధపడిన ఈ చిన్న చిత్రం పెద్ద బ్యానర్ అండదండలు ఉన్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద పోరాడుతోంది.

ఈ పరిస్థితికి రెండు కారణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొదటిది గాడ్ ఫాదర్ సునామి. చిరంజీవికి మళ్ళీ కంబ్యాక్ ఇచ్చిన బ్లాక్ బస్టర్ గా దీనికి వచ్చిన వసూళ్లే సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా బీసీ సెంటర్స్ రచ్చ ఓ రేంజ్ లో ఉంది. ది ఘోస్ట్ ఫలితం ఆల్రెడీ తేలిపోయింది కాబట్టి నెక్స్ట్ ఉన్న బెస్ట్ ఆప్షన్ స్వాతిముత్యమే. అయితే చాలా చోట్ల తక్కువ థియేటర్లున్న సెంటర్లలో మెగా మూవీ తాలూకు ఓవర్ ఫ్లోస్ గణేష్ కు షిఫ్ట్ కావడం లేదు. కొత్త హీరోని ప్రత్యేకంగా చూసేందుకు జనం అంత సుముఖంగా లేరు. పైగా హీరోయిన్ తో సహా క్యాస్టింగ్ లో స్టార్ మెరుపులు లేకపోవడం మరో చిక్కు.

ప్రమోషన్లు గట్రా గట్టిగానే చేస్తున్నప్పటికీ స్వాతిముత్యం ఇంకా స్పీడు అందుకోవాలి. వచ్చే వారం పెద్దగా చెప్పుకునే సినిమాలేం లేవు. ఆ మాటకొస్తే దీపావళి దాకా ఏమంత హడావిడి చేసే బొమ్మలు రావు. సో రెండో వారం గణేష్ టీమ్ కి చాలా కీలకం. పబ్లిక్ లోకి తమ చిత్రంలో మంచి విషయముందనే సందేశాన్ని బలంగా తీసుకెళ్లాలి. అప్పుడు కానీ గాడ్ ఫాదర్ చూసేసినవాళ్లు, కేవలం ఎంటర్ టైన్మెంట్ ని మాత్రమే కోరుకునే కామెడీ లవర్స్ హాలు దాకా రారు. రెస్పాన్స్ విషయంలో నిర్మాత కాన్ఫిడెన్స్ నిజమే అయినప్పటికీ అది వసూళ్లుగా మారితేనే కదా సార్థకత.