పవన్‌కు చిరు చేయాల్సిన ఇంకో సాయం


మొత్తానికి తన రాజకీయ ప్రయాణం విషయంలో చిరంజీవి ఒక స్పష్టత ఇచ్చేశారు. ఆయన తిరిగి రాజకీయాల్లోకి వస్తాడన్న అంచనాలు ఎవరికీ లేవు కానీ.. తన తమ్ముడి పొలిటికల్ జర్నీకి ఆయన ఏ రకమైన సహకారం అందిస్తాడనే విషయంలో ఉన్న అయోమయానికి చిరు తెరదించేశాడు. రాజకీయాలకు టాటా చెప్పేశాక తాను సైలెంటుగా ఉండడమే పవన్‌కు చేసే అతి పెద్ద సాయం అనే విషయాన్ని చిరు బాగానే అర్థం చేసుకున్నట్లున్నారు.

పవన్ కంటే పెద్ద స్టేచర్ ఉన్న చిరు రాజకీయాల్లో విఫలమై, దాన్నుంచి బయటికి వచ్చేశాక.. మళ్లీ పవన్‌కు మద్దతు అంటూ అతడి కోసం పని చేయాల్సిన అవసరం లేదు. చిరు చెప్పినా చెప్పకపోయినా ఆయన మద్దతు పవన్‌కు ఉన్నట్లే. అభిమానుల్లో కూడా ఏమీ భిన్నాభిప్రాయాలు ఉండవు. ఇంకా చెప్పాలంటే చిరు నేరుగా రంగంలోకి దిగి పవన్ కోసం పని చేసినా, తన మద్దతు ప్రకటించినా జరిగే మేలు కంటే నష్టమే ఎక్కువ. ఎందుకంటే పొలిటికల్‌గా చిరు ఒక పెద్ద ఫెయిల్యూర్ అనే విషయం మరువరాదు. ఆయన తాలూకు నెగెటివ్ ఎఫెక్ట్‌ పవన్ మీద గట్టిగానే పడిందన్నది కూడా వాస్తవం. ప్రస్తుతానికి చిరు ఏమీ చేయకుండా సైలెంటుగా ఉండడమే పవన్‌కు మంచిది.

ఐతే దీంతో పాటు పవన్‌కు చిరు చేయాల్సిన సాయం ఇంకోటి ఉంది. పవన్‌ తనకు ప్రధాన రాజకీయ ప్రత్యర్థిగా భావిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సాధ్యమైనంత దూరంగా ఉండడం. ఆయనతో ఏమీ శత్రుత్వం పెట్టుకోవాల్సిన పని లేదు కానీ.. సన్నిహిత సంబంధాల కోసం, ఆయన మెప్పుకోసం ప్రయత్నించడం వల్ల పవన్‌కు జరుగుతున్న డ్యామేజీ ఎక్కువ. మూడు రాజధానుల విషయంలో మద్దతు ప్రకటించడం, వివిధ సందర్భాల్లో జగన్‌తో అత్యంత సన్నిహితంగా మెలగడం, ట్విట్టర్లో సందర్భానుసారం జగన్‌ను పొగడ్డం లాంటి వాటి వల్ల పవన్‌కు చాలానే డ్యామేజీ జరిగింది. అన్న అంటకాగుతుంటే.. తమ్ముడు ఏం పోరాడతాడనే ప్రశ్నలు ఉత్పన్నం అయ్యాయి. వైకాపాను, జగన్‌ను చిరు టార్గెట్ చేయకపోయినా పర్వాలేదు కానీ.. తటస్థంగా, దూరంగా ఉంటే చాలన్నది పవన్ అభిమానుల మాట.