ఇద్దరు మిత్రులను దసరా గెలిపిస్తుందా?


మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జునల స్నేహం గురించి అందరికీ తెలిసిందే. వ్యక్తిగతంగా, వ్యాపార పరంగా వీరికి మంచి అనుబంధం ఉంది. అలాంటి మిత్రులు కొన్ని దశాబ్దాల విరామం తర్వాత బాక్సాఫీస్ సమరానికి సిద్ధమవుతున్నారు. చిరు సినిమా ‘గాడ్ ఫాదర్’తో పాటు నాగ్ మూవీ ‘ది ఘోస్ట్’ దసరా కానుకగా బుధవారం ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. తమ మధ్య బాక్సాఫీస్ పోటీ ఏమీ లేదని, రెండు సినిమాలూ బాగా ఆడాలంటూ ఈ ఇద్దరు సీనియర్ హీరోలు ఆకాంక్షిస్తున్నారు.

ఐతే ఎంత కాదన్నా వీటి మధ్య పోటీ ఉంటుంది. ఏ సినిమాకు ఎక్కువ పాజిటివ్ టాక్ వస్తే.. దాని వైపు ప్రేక్షకులు మళ్లుతారు. రెంటికీ మంచి టాక్ వచ్చి రెండూ బాగా ఆడితే అందరికీ సంతోషమే. ఈ సినిమాలు ఈ ఇద్దరు మిత్రుల కెరీర్లలో చాలా ముఖ్యమైనవి అనడంలో సందేహం లేదు.

చిరు చివరి సినిమా ‘ఆచార్య’ ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో తెలిసిందే. బాక్సాఫీస్ దగ్గర కెరీర్లో ఎన్నడూ ఎదుర్కోనంత అవమాన భారాన్ని ఎదుర్కొన్నారు చిరు. ఆ గాయానికి ‘గాడ్ ఫాదర్’ మందు వేస్తుందన్న ఆశతో ఆయనతో పాటు అభిమానులూ ఉన్నారు. రీమేక్ సినిమా కావడం వల్ల దీనికి ముందు అంత బజ్ కనిపించలేదు కానీ.. రిలీజ్ టైంకి సందడి బాగానే కనిపిస్తోంది. మరో భాషలో పెద్ద హిట్టయిన సినిమా కాబట్టి మినిమం గ్యారెంటీ అనే అంచనా ఉంది. ఐతే ఒరిజినల్‌కు చేసిన మార్పులు చేర్పులతో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తారా అన్నది చూడాలి.

ఇక నాగ్ విషయానికి వస్తే.. గత ఏడాది ఆయన్నుంచి వచ్చిన ‘వైల్డ్ డాగ్’ పాజిటివ్ టాక్ తెచ్చుకుని కూడా సరైన వసూళ్లు రాబట్టలేక బాక్సాఫీస్ ఫెయిల్యూర్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో ‘ది ఘోస్ట్’కు మంచి టాక్ వచ్చినా అందుకు తగ్గట్లు వసూళ్లు వస్తాయా లేదా.. ‘గాడ్ ఫాదర్’ పోటీని ఈ చిత్రం తట్టుకోగలదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమా అటు ఇటు అయితే నాగ్ కెరీరే ప్రశ్నార్థకంగా మారుతుంది. మరి ‘ది ఘోస్ట్’ ఎలాంటి ఫలితాన్నందుకుంటుందో చూడాలి. మరోవైపు ‘స్వాతిముత్యం’ అనే చిన్న సినిమా కూడా దసరా రేసులో నిలిచింది. ఈ చిత్రానికి ముందు రోజే పెయిడ్ ప్రీమియర్లు వేయగా.. మంచి స్పందనే వచ్చింది. కానీ రెండు పెద్ద సినిమాల పోటీని తట్టుకుని ఈ చిత్రం ఏమేర ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తుందో చూడాలి.