ఆదిపురుష్‌.. అదీ ఇదీ రెండూ ట్రెండింగ్‌

నిన్న‌ట్నుంచి దేశ‌వ్యాప్తంగా సినీ ప్రియుల చ‌ర్చ‌ల‌న్నీ ఆదిపురుష్ చుట్టూనే తిరుగుతున్నాయి. ఈ సినిమా టీజ‌ర్‌ను అయోధ్య‌లో భారీ ఈవెంట్ ఏర్పాటు చేసి లాంచ్ చేసిన సంగ‌తి తెలిసిందే. ప్రేక్ష‌కుల అంచ‌నాలు అందుకోవ‌డంలో టీజ‌ర్ విఫ‌ల‌మైంద‌నే చెప్పాలి. జ‌నాలు ఏదో ఊహించుకుంటే ఇంకేదో చూపించాడు ద‌ర్శ‌కుడు ఓం రౌత్. ముఖ్యంగా ఇదొక యానిమేష‌న్ మూవీలాగా క‌నిపించ‌డం మెజారిటీ ప్రేక్ష‌కుల‌కు రుచించ‌లేదు. అందులోని విజువ‌ల్ ఎఫెక్ట్స్.. రావ‌ణుడి పాత్ర‌ను ప్రెజెంట్ చేసిన విధానం జ‌నాల‌కు అస్స‌లు న‌చ్చ‌లేద‌న్న‌ది స్ప‌ష్టం.

ఈ నేప‌థ్యంలో ఆదివారం రాత్రి నుంచి ఈ టీజ‌ర్ మీద విప‌రీత‌మైన ట్రోలింగ్ జ‌రుగుతోంది. త‌ర్వాతి రోజు ఉద‌యానికి ఈ నెగెటివిటీ ఇంకో ట‌ర్న్ తీసుకుంది. కొన్ని నెల‌ల నుంచి చాలా బాలీవుడ్ సినిమాల‌కు ఎదురైన స‌మ‌స్యే దీనికీ మొద‌లైంది. బాయ్‌కాట్ ఆదిపురుష్ అంటూ ట్రెండ్ మొద‌లుపెట్టేసింది ఒక వ‌ర్గం.

ముస్లిం అయిన సైఫ్ అలీఖాన్ రావ‌ణుడి పాత్ర‌ను పోషించ‌డం.. అత‌డి లుక్ ఔరంగ‌జేబు, అల్లావుద్దీన్ ఖిల్జీల‌ను పోలి ఉండ‌డం ఒక వ‌ర్గానికి అస్స‌లు రుచించ‌ట్లేదు. సైఫ్ విష‌యంలో ముందు నుంచే నెగెటివిటీ ఉండ‌గా.. అది ఇప్పుడు తీవ్ర స్థాయికి చేరుకుంది. అలాగే ఆంజ‌నేయుడు పాత్ర‌ధారి లుక్ కూడా ముస్లింను గుర్తు తెచ్చేలా ఉండ‌డం.. ఇంకా అనేక అంశాలు అభ్యంత‌రక‌రంగా ఉండ‌డంతో ఈ సినిమాను హిందూ స‌మాజం బ‌హిష్క‌రించాల‌ని ఈ వ‌ర్గం పిలుపునిస్తోంది. రామాయ‌ణం హిందీ సీరియ‌ల్‌తో పోల్చి దీన్ని మ‌రింత‌గా ట్రోల్ చేస్తున్నారు.

ఐతే బాయ్‌కాట్ ఆదిపురుష్ అనే హ్యాష్ ట్యాగ్‌తో పాటే రికార్డ్ బ్రేకింగ్ ఆదిపురుష్ టీజ‌ర్ అనే హ్యాష్ ట్యాగ్ సైతం టాప్‌లోనే ట్రెండ్ అవుతుండ‌డం విశేషం. ఈ టీజ‌ర్ వ్యూస్ 60 మిలియ‌న్ల‌కు చేరువ‌గా ఉండ‌డం విశేషం. ఇప్ప‌టిదాకా టీజ‌ర్ వ్యూస్, లైక్స్ రికార్డుల‌న్నింటినీ ఆదిపురుష్ బ‌ద్ద‌లు కొట్టేసిందంటున్నారు. ఈ నేప‌థ్యంలోనే పాజిటివ్ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. మ‌రి మున్ముందు ఈ నెగెటివిటీదే డామినేష‌నా.. లేక పాజిటివిటీ పెరుగుతుందా అన్న‌ది చూడాలి.