గత వారాంతంలో పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన భారీ చిత్రం పొన్నియన్ సెల్వన్ బాక్సాఫీస్ పరిస్థితి చాలా చిత్రంగా కనిపిస్తోంది. ఈ సినిమాను తమిళ ప్రేక్షకులు ఒక కళాఖండంలా చూస్తున్నారు మొదట్నుంచి. దీని విషయంలో వాళ్ల ఎగ్జైట్మెంట్ మామూలుగా లేదు. అడ్వాన్స్ బుకింగ్స్ ఒక రేంజిలో జరిగాయి. సినిమాకు అక్కడ ఫుల్ పాజిటివ్ టాక్ వచ్చింది. సమీక్షలన్నీ సూపర్ అన్నట్లుగానే వచ్చాయి. రిలీజ్ తర్వాత సినిమాకు వసూళ్లు కూడా మామూలుగా లేవు.
తొలి రోజు నుంచి తమిళనాడు అంతటా ప్యాక్డ్ హౌసెస్‌తో నడుస్తోంది. వీకెండ్ తర్వాత కూడా పొన్నియన్ సెల్వన్‌కు టికెట్లు దొరకడం కష్టంగా ఉంది. ఆన్ లైన్లో చూస్తే సోల్డ్ ఔట్, ఫాస్ట్ ఫిల్లింగ్ మోడ్‌లో ఉన్నాయి థియేటర్లన్నీ. కేరళలో తమిళులు ఎక్కువగా ఉంటారు కాబట్టి అక్కడ కూడా సినిమాకు మంచి వసూళ్లే వస్తున్నాయి. యుఎస్‌లో తమిళులు ఈ సినిమాను బాగానే చూస్తున్నారు.
కానీ పొన్నియన్ సెల్వన్ తమిళయేతర వెర్షన్లన్నీ ప్రేక్షకులు లేక వెలవెలబోతున్నాయి. ఈ సినిమా తమిళం కాకుండా కొంత ప్రభావం చూపించింది తెలుగులో మాత్రమే. ఇక్కడ నెగెటివ్ టాక్ వచ్చినా సరే.. సినిమా గురించి పెద్ద చర్చే జరిగింది. బేసిగ్గా ఇలాంటి భారీ చిత్రాల పట్ల మన ప్రేక్షకుల్లో ఉండే ఆసక్తి, అందులోని కాస్ట్ అండ్ క్రూతో మనవాళ్లకు ఉన్న అనుబంధం వల్ల తొలి వీకెండ్లో పొన్నియన్ సెల్వన్ ఓ మోస్తరు వసూళ్లు రాబట్టింది.
కానీ ఆదివారం తర్వాత సినిమా చల్లబడిపోయింది. సోమవారం ఉదయం నుంచి థియేటర్లు ఖాళీ అయిపోయాయి. సాయంత్రం షోలకు కూడా జనాలు లేని పరిస్థితి. మన ప్రేక్షకుల దృష్టి ఇక దసరా సినిమాల మీదికి మళ్లినట్లే ఉంది. ఇంకో రెండు రోజులాగితే గాడ్ ఫాదర్, ది ఘోస్ట్ సినిమాలు వస్తాయని చూస్తున్నట్లున్నారు. పొన్నియన్ సెల్వన్‌ను పక్కన పెట్టేశారు. ఇక్కడ సినిమా థియేట్రికల్ రన్ దాదాపు ముగింపు దశకు వచ్చేసినట్లే. ఈ చిత్రాన్ని తెలుగులో పంపిణీ చేసిన దిల్ రాజుకు ఎదురు దెబ్బ తగిలినట్లే కనిపిస్తోంది.