శృతి హాసన్ సినిమా కూడా ఓటిటిలోనే!

దక్షిణాదిలో ఓటిటి రిలీజ్ పరంగా ఇంకా నిర్మాతలకు కొన్ని రిజర్వేషన్లు ఉన్నాయి కానీ బాలీవుడ్ ఈ వేదికను వాడేసుకుంటోంది. ఏకంగా ఏడు సినిమాలు డిస్నీ హాట్ స్టార్లో రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. అంత మంది ఓటిటిపై నమ్మకం పెడితే ఇక మిగతావాళ్ళు ఎందుకు వెనక ఉండిపోతారు. మరిన్ని సినిమాలు ఈ బాట పడుతున్నాయిప్పుడు. శృతి హాసన్ కథానాయికగా నటించిన యారా అనే చిత్రం జులై 30న జీ 5లో రిలీజ్ అవుతోంది.

ఇందులో బాలీవుడ్ యాక్షన్ హీరో విద్యుత్ జమ్మావాల్ కథానాయకుడు. పాన్ సింగ్ తోమర్, సాహెబ్ బీవీ ఔర్ గ్యాంగ్స్టర్ చిత్రాల దర్శకుడు టిగ్మాన్షు ధులియా ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఫ్రెంచ్ సినిమా ఏ గ్యాంగ్ స్టోరీకి అఫీషియల్ రీమేక్ అయిన ఈ చిత్రం తన కెరీర్ కి బ్రేక్ ఇస్తుందని శృతి హాసన్ ఆశలు పెట్టుకుంది. మధ్యలో కొంత కాలం బ్రేక్ తీసుకుని మళ్ళీ నటిస్తున్న శృతి తెలుగులో రవితేజతో క్రాక్ చిత్రంలో నటిస్తోంది.