వర్షంలో మెగాస్టార్ ఉద్వేగం

అనంతపూర్ లో జరిగిన గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ బాగా ఆలస్యం జరగడంతో వరుణ దేవుడు పలకరించేశాడు. ముందు తొలకరి జల్లుగా మొదలైనప్పటికీ చివరికది భారీ వర్షంగా మారడంతో చిరంజీవి తడుస్తూనే ప్రసంగించాల్సి వచ్చింది. పక్కనే ఉన్నవాళ్లు ముందు గొడుగు పట్టే ప్రయత్నం చేసినా ఆయన వారించి తీసేశారు. ఈ సందర్భంగా రాయలసీమకు ఎప్పుడు వచ్చినా ఇలా వర్షం స్వాగతం చెప్పడం చాలా సంతోషంగా ఉందని చెప్పిన చిరు తన స్పీచ్ కు ముందు ఇవాళ కన్నుమూసిన ఇందిరాదేవిగారికి సభపైనే నివాళి అర్పించారు.

సహజంగా ప్రతి ఈవెంట్ మాటల్లో ఒకింత ఎగ్జైట్ మెంట్ ఫీలయ్యే మెగాస్టార్ ఈసారి మరింత ఎక్కువ ఉద్వేగానికి గురయ్యారు. అది ఆయన టెంపోలోనే అర్థమైపోయింది. ఆచార్య తాలూకు ఫలితాన్ని నేరుగా ప్రస్తావించకపోయినా అది స్ఫురించేలా ఈసారి నిరాశ పరచనని హామీ ఇవ్వడం ఫ్యాన్స్ కి ఊరట కలిగించింది. ఇక తమన్ ని ఏకంగా ఆకాశానికెత్తేశారు. పదే పదే పొగిడేశారు. నిజానికి వచ్చిన రెండు పాటలు, ట్రైలర్ లో బిజిఎం తన బెస్ట్ వర్క్ అనిపించేలా లేవని సోషల్ మీడియాలో డిబేట్ జరుగుతుండగా ఇలా అనడం గమనార్హం. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇంకో లెవెల్ లో ఉంటుందని తెగ ఊరించేశారు.

సత్యదేవ్, దర్శకుడు మోహన్ రాజాల గురించి ప్రత్యేకంగా ప్రోత్సహిస్తూ చాలానే చెప్పుకొచ్చారు. తన అభిమానులే గాడ్ ఫాదర్లని ఫ్యాన్స్ మీద ప్రశంసల జల్లులు కురిపించారు. ఇదంతా బాగానే ఉంది కానీ మూడు నాలుగు గంటల పాటు ఇతర నటీనటుల స్పీచులు, ఏవిలు, పాటలు, డాన్సులతో విపరీత కాలయాపన చేస్తూ అసలు విషయానికి వచ్చేటప్పటికి ఇలాంటి ఇబ్బంది ఎదురు కావడం ఈ మధ్య చాలా ప్రీ రిలీజ్ ఈవెంట్లకు జరిగింది. విరాట పర్వం సైతం కర్నూలులో జరిగినప్పుడు అర్ధాంతరంగా ఆపేయాల్సి వచ్చింది. ఇకనైనా రెండు గంటల లోపే పూర్తి చేసేలా ప్లానింగ్ చేస్తే బాగుంటుందేమో.