ఆదిపురుష్ టీజర్.. ఆహా ఓహో

ఈ రోజుల్లో పబ్లిసిటీ చాలా కీలకంగా మారిన నేపథ్యంలో చిత్రీకరణ మొదలు కాకుండానే లేదంటే ఆరంభ దశలోనే ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడం.. మరికొన్ని రోజులకు టీజర్ లాంచ్ చేయడం జరుగుతోంది. కానీ ‘ఆదిపురుష్’ సినిమా చిత్రీకరణ పూర్తయి దాదాపు పది నెలలు కావస్తున్నా ఇప్పటిదాకా ఒక్క లుక్ కూడా బయటికి రాలేదు.

సినిమాను అనౌన్స్ చేసినపుడు రిలీజ్ చేసిన యానిమేటెడ్ పోస్టర్లు తప్పితే.. ప్రభాస్ లుక్ ఒక్కటీ బయటికి రాలేదు. ఐతే సినిమా చిత్రీకరణతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేశాక బ్యాంగ్ బ్యాంగ్ ప్రమోషన్లతో హోరెత్తించాలని దర్శకుడు ఓం రౌత్ ప్లాన్ చేసుకున్నాడు. ఆ ప్రకారమే అతను అన్ని పనులూ దాదాపుగా పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఇక ప్రమోషన్ల హోరు మొదలు కాబోతోంది. మరి కొన్ని రోజుల్లోనే ఫస్ట్ లుక్, టీజర్ రెండూ ఒకేసారి రిలీజ్ కాబోతున్నాయి. ఇందుకు ముహూర్తం కూడా కుదిరింది.

అక్టోబరు 2న అయోధ్యలో ‘ఆదిపురుష్’ టీజర్ లాంచ్ కాబోతున్నట్లు వస్తున్న సమాచారం నిజమే అని తెలుస్తోంది. తన పెదనాన్న కృష్ణంరాజు మరణం నేపథ్యంలో ప్రభాస్ ఈ కార్యక్రమంలో పాల్గొంటాడా లేదా అని ముందు సందేహాలు కలిగాయి. ఐతే సినిమా ప్రమోషన్‌ను ఒకేసారి టాప్ రేంజికి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ప్రభాస్ ఈ వేడుకకు హాజరు కాబోతున్నట్లు సమాచారం.

ఇక బాలీవుడ్లో కొందరు ప్రముఖులకు ‘ఆదిపురుష్’ టీజర్ ముందే చూపించారని.. వాళ్లందరూ అందులోని విజువల్స్, ఎఫెక్ట్స్, అన్నింటికీ మించి ప్రభాస్ లుక్, స్క్రీన్ ప్రెజెన్స్ చూసి ఫిదా అయిపోయారని.. టీజర్‌ చూసి సామాన్య ప్రేక్షకులు కూడా మెస్మరైజ్ కావడం పక్కా అని.. సినిమాపై అంచనాలను ఒక్కసారిగా టీజర్ పెంచేయబోతోందని బాలీవుడ్లో ఇప్పటికే టాక్ మొదలైంది. ‘ఆదిపురుష్’ను 30కి పైగా భాషల్లో వచ్చే ఏడాది జనవరి 11న రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.