జగన్ చిచ్చు.. నందమూరి వార్ పీక్స్


ఆంధ్రప్రదేశ్ రాజధాని వ్యవహారం మీద అసెంబ్లీ సహా అన్ని చోట్లా అట్టుడికి పోతున్న సమయంలో.. జగన్ సర్కారు తెలివిగా ఈ వ్యవహారం నుంచి అందరి దృష్టిని మళ్లించే ఎత్తుగడ వేసింది. విజయవాడలోని వైద్య విద్యాలయానికి ఎన్టీఆర్ పేరును తీసేసి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టడం మీద నాలుగు రోజుల నుంచి ఎంత దుమారం నడుస్తోందో తెలిసిందే. అమరావతితో పాటు మిగతా అన్ని విషయాలూ పక్కకు వెళ్లిపోయి దీని మీదే వాదోపవాదాలు నడుస్తున్నాయి.

ఐతే ఈ విషయంలో వైసీపీ వెర్సస్ టీడీపీ వార్ కంటే కూడా టీడీపీలో అంతర్గతంగా జరుగుతున్న గొడవే పెద్దదైపోయింది. ఎన్టీఆర్ పేరు తీసేయడంపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించిన తీరు పట్ల టీడీపీలో, అలాగే నందమూరి అభిమానుల్లో ఒక వర్గం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలోనూ తారక్ మీద వివిధ అంశాల్లో ఒక వర్గం వ్యతిరేకత చూపించడం తెలిసిందే. కానీ ఈసారి దాడి చాలా తీవ్ర స్థాయిలో ఉంది.

ఎన్లీఆర్ పేరు పెట్టుకుని, ఆయన పేరును వాడుకుని ఎదిగిన జూనియర్.. ఇప్పుడు ఆయన పేరు మార్పు విషయంలో చాలా సున్నితంగా స్పందించడం, గట్టిగా ఖండించకపోవడం, వైఎస్ గురించి కూడా సానుకూలంగా మాట్లాడడం ఈ వర్గానికి అసలు రుచించడం లేదు. ఈ విషయంలో మునుపెన్నడూ లేనంత తీవ్ర స్థాయిలో తారక్ మీద దాడి జరుగుతోంది. ఐతే అటు వైపు తారక్ మద్దతుదారులు కూడా అంతే తీవ్రంగా స్పందిస్తున్నారు. పార్టీ కోసం గతంలో తారక్ సేవల్ని వాడుకుని, ఆ తర్వాత అతణ్ని పక్కన పడేసి, పార్టీకి తన అవసరమే లేదంటున్న వాళ్లకు అతను ఎలా స్పందిస్తే ఏంటి అని ప్రశ్నిస్తున్నారు.

ఓవైపు ఎన్టీఆర్ ను రాజకీయంగా, సినిమా పరంగా తొక్కడానికి ప్రయత్నిస్తూ.. అతను పార్టీకి రాకుండా అడ్డుకట్ట వేస్తూ, తరచుగా అతడి ఇమేజ్ ను తగ్గించే ప్రయత్నం చేస్తూ.. ఇప్పుడు అతడి స్పందన గురించి ఎందుకింత తీవ్రంగా రెస్పాండవుతున్నారని వారు నిలదీస్తున్నారు.తారక్ అసలెందుకు తీవ్రంగా స్పందించి వైసీపీ ప్రభుత్వం, ఆ పార్టీ మద్దతుదారులు, వైఎస్ అభిమానుల్లో చెడు కావాలని వాళ్లు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో ఇరు వర్గాల మధ్య ఆన్ లైన్, ఆఫ్ లైన్ వార్ తీవ్ర స్థాయిలోనే నడుస్తోంది. మొత్తానికి హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పుతో నందమూరి, టీడీపీ అభిమానుల్లో పెద్ద చిచ్చే రాజేశారని చెప్పాలి.