బాల‌య్య ఫ్యాన్సా మ‌జాకా

ఓవైపు కొత్త సినిమాలకు ఆశించిన స్థాయిలో జ‌నం లేరు. వాటి థియేట‌ర్లు వెల‌వెల‌బోతున్నాయి. కానీ 20 ఏళ్ల ముందు నాటి సినిమా ఒక‌టి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంద‌డి చేస్తోంది. ఆ చిత్ర‌మే.. చెన్న‌కేశ‌వరెడ్డి. ఈ నెల ఆరంభంలో జ‌ల్సా సినిమా ఎలా అయితే తెలుగు రాష్ట్రాల‌ను షేక్ చేసిందో.. ఇప్పుడు చెన్న‌కేశ‌వ‌రెడ్డికి సైతం అదే స్థాయిలో హ‌డావుడి కనిపిస్తోంది.

ఈ సినిమా విడుద‌లై ఆదివారం నాటికి 20 ఏళ్లు పూర్త‌వుతుండ‌గా.. ముందు రోజు నుంచే రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున స్పెష‌ల్ షోలు మొద‌ల‌య్యాయి. శ‌నివారం ఉద‌యం హైద‌రాబాద్‌లోని ప్ర‌సాద్ మ‌ల్టీప్లెక్స్‌లో చెన్నకేశ‌వరెడ్డి స్పెష‌ల్ షోలు మొద‌లు కాగా.. అవి ప్యాక్డ్ హౌసెస్‌తో న‌డుస్తున్నాయి.

మామూలుగా మ‌ల్టీప్లెక్సుల్లో అభిమానుల హ‌డావుడి అరుపులు, కేక‌ల వ‌ర‌కే ఉంటుంది. కానీ చెన్న‌కేశ‌వ‌రెడ్డి షోల సంద‌ర్భంగా మాత్రం మ‌ల్టీప్లెక్స్ కాస్తా సింగిల్ స్క్రీన్ లాగా మారిపోయింది. పోకిరి, జ‌ల్సా సినిమాల‌కు సింగిల్ స్క్రీన్ల‌లో జ‌రిగిన ర‌చ్చంతా చూశాం. అదే స్థాయిలో ప్ర‌సాద్ మ‌ల్టీప్లెక్స్‌లో అభిమానులు స్క్రీన్ ముందుకు చేరి ర‌చ్చ ర‌చ్చ చేశారు. ఇందులో బాల‌య్య‌-ట‌బు మ‌ధ్య వ‌చ్చే పాట‌కు అభిమానులు చేసిన సంద‌డికి సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో తిరుగుతున్నాయి. అలాగే ఇందులోని ఎలివేష‌న్ సీన్ల వీడియోలు కూడా వైర‌ల్ అవుతున్నాయి. అవ‌న్నీ చూసి బాల‌య్య అభిమానులా మ‌జాకా అని నెటిజ‌న్లు కొనియాడుతున్నారు.

ఐతే ఎంత హ‌డావుడి చేసిన‌ప్ప‌టికీ.. పోకిరి, జ‌ల్సా షోల సంద‌ర్భంగా కొన్ని థియేట‌ర్ల‌తో జ‌రిగిన విధ్వంసాన్ని దృష్టిలో ఉంచుకుని అలా జ‌ర‌గ‌కుండా బాల‌య్య అభిమానులు జాగ్ర‌త్త ప‌డుతున్నట్లు క‌నిపిస్తోంది. థియేట‌ర్ల‌ను ధ్వంసం చేసి తమ హీరోకు చెడ్డ పేరు తేవొద్ద‌ని, ఇలా భ‌విష్య‌త్తులో స్పెష‌ల్ షోలు బ్రేక్ ప‌డేలా చేయొద్ద‌ని బాల‌య్య ఫ్యాన్స్ నిర్ణ‌యించుకున్న‌ట్లు స‌మాచారం.