సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళిల కాంబినేషన్లో సినిమా గురించి చర్చ ఇప్పటిది కాదు. పుష్కరం కిందటే ఆ దిశగా ప్రయత్నాలు జరిగాయి. ఐతే ఎట్టకేలకు రెండేళ్ల కిందట ఈ ప్రాజెక్టు కన్ఫమ్ అయింది. కానీ ఈ సినిమా పట్టాలెక్కడానికి ఇంకా చాలా సమయమే పట్టేలా ఉంది. ప్రస్తుతానికి మహేష్ బాబు.. త్రివిక్రమ్ సినిమా మీదే ఫోకస్ పెట్టాడు.
ఈ సినిమా పూర్తయి విడుదల కావడానికి ప్రస్తుత అంచనాల ప్రకారం ఇంకో ఎనిమిది నెలలు పడుతుంది. అంతకంటే ఆలస్యమైనా ఆశ్చర్యం లేదు. ఆ తర్వాత మహేష్ రాజమౌళి సినిమా కోసం మేకోవర్ కావాల్సి ఉంటుంది. ఆ సినిమాకు ఇంకా కథ కూడా ఫైనలైజ్ కాలేదు. ప్రి ప్రొడక్షన్ పనులేమీ మొదలే కాలేదు. ఇవన్నీ జరిగాకే కాస్టింగ్ గురించే ఆలోచిస్తారు.
కానీ మీడియాలో మాత్రం చాలా ముందుగానే కాస్టింగ్ గురించి రకరకాల ఊహాగానాలు వచ్చేస్తున్నాయి. మహేష్-రాజమౌళి సినిమాలో కథానాయికగా బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తుందని ఒకరంటే.. హాలీవుడ్ మూవీ బ్లడ్ షాట్ ఫేమ్ ఐజా గొంజాలెజ్ పేరును పరిశీలిస్తున్నారని ఇంకొకరంటారు. ఇప్పుడేమో వరుసగా కీలక పాత్రల కోసం హాలీవుడ్ ఆర్టిస్టుల పేర్లు తెరపైకి వచ్చేశాయి. థోర్ యాక్టర్ క్రిస్ హేమ్స్‌వర్త్ ఈ చిత్రంలో ఎక్స్‌టెండెడ్ క్యామియో చేయబోతున్నాడని.. అవెంజర్స్‌లో థానోస్ పత్ర చేసిన జోష్ బోర్లిన్‌తోనూ ఈ చిత్ర బృందం చర్చలు జరుపుతోందని.. ఇంకా శామ్ జాక్సన్ పేరు కూడా పరిశీలనలో ఉందని.. ఇలా ఎవరికి తోచినట్లు వాళ్లు వార్తలు అల్లేస్తున్నారు.
హాలీవుడ్ కాస్టింగ్ ఏజెన్సీ సీఏఏతో రాజమౌళి ఒప్పందం చేసుకుని కొన్ని రోజులే అయింది. ముందు ఈ సినిమాకు స్క్రిప్టు రెడీ అవ్వాలి. పాత్రలకు ఒక రూపు రావాలి. ఆ తర్వాత వాటికి ఎవరు అయితే బాగుంటుందో.. ఎవరిని తీసుకుంటే సినిమా పాన్ వరల్డ్ స్థాయికి వెళ్తుందో చూస్తారు. సినిమా బడ్జెట్ పరిమితులను కూడా దృష్టిలో ఉంచుకుని ఏదైనా చేయాల్సి ఉంటుంది. కానీ అలూ లేదు చూలు లేదు సామెతను గుర్తు చేస్తూ అప్పుడే ఆర్టిస్టుల గురించి ఇలా ఇష్టం వచ్చినట్లు ఊహాగానాలు సృష్టించడం విడ్డూరం.