సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఇటీవలే మొదలైన కొత్త సినిమా మీద అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీరి కలయికలో వచ్చిన తొలి రెండు చిత్రాలు అతడు, ఖలేజాలతో పోలిస్తే ఇందులో బోలెడంత యాక్షన్ ఉంటుందని, మహేష్ అభిమానులతో పాటు మాస్ ప్రేక్షకులను ఈ సినిమా ఉర్రూతలూగిస్తుందని ముందు నుంచి సంకేతాలు అందుతూనే ఉన్నాయి.
ఈ సినిమా గురించి చర్చ వచ్చినపుడల్లా యాక్షన్ యాక్షన్ అనే మాటే వినిపిస్తోంది. అందుకు తగ్గట్లే సినిమా చిత్రీకరణను ఒక భారీ యాక్షన్ ఘట్టంతోనే మొదలుపెట్టారు.రామోజీ ఫిలిం సిటీలో జరిగిన ఆ షెడ్యూల్ షూట్ గురించి అధికారికంగానే చిత్ర బృందం అప్‌డేట్ ఇచ్చింది. నిర్మాల్లో ఒకరైన నాగవంశీ ఫస్ట్ షెడ్యూల్ అప్‌డేట్‌ను మహేష్ అభిమానులతో పంచుకున్నాడు.
తమిళంలో ప్రస్తుతం టాప్ యాక్షన్ కొరియోగ్రాఫర్లుగా పేరున్న కవల సోదరులు అన్బు-అరివు ఈ సినిమాకు పని చేస్తుండడం విశేషం. విక్రమ్ సహా కొన్ని భారీ చిత్రాలకు వాళ్లు పని చేశారు. తెలుగులో ఈ సోదరులు చేస్తున్న తొలి చిత్రం మహేష్-త్రివిక్రమ్‌లదే. వీరి నేతృత్వంలో తొలి షెడ్యూల్లో కొన్ని కిక్ యాస్, హై ఆక్టేన్ , ఎపిక్ యాక్షన్ సీన్లు చిత్రీకరించామంటూ అభిమానులకు గూస్ బంప్స్ ఇచ్చే మాటలు చెప్పాడు నాగవంశీ. సినిమా రెండో షెడ్యూల్ దసరా తర్వాత ఉంటుందని, అందులో మహేష్ బాబుతో పాటు బుట్టబొమ్మ పూజా హెగ్డే కూడా పాల్గొంటుందని నాగవంశీ అప్‌డేట్ ఇచ్చాడు.