కాజ‌ల్ ఈజ్ బ్యాక్

సౌత్ ఫిలిం ఇండ‌స్ట్రీలో తిరుగులేని ఆధిప‌త్యం చ‌లాయించిన క‌థానాయికల్లో కాజ‌ల్ అగ‌ర్వాల్ ఒక‌రు. ల‌క్ష్మీ క‌ళ్యాణం అనే చిన్న సినిమాతో ప్ర‌స్థానం ఆరంభించి.. కొన్నేళ్లలోనే మ‌గ‌ధీర లాంటి మెగా మూవీలో క‌థానాయిక‌గా అవ‌కాశం అందుకుని, స్టార్ హీరోయిన్ అయిన ఆమె.. ఆ త‌ర్వాత ఇటు తెలుగులో, అటు త‌మిళంలో పెద్ద పెద్ద హీరోల స‌రస‌న భారీ సినిమాల్లో న‌టించి టాప్ హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగింది. అడ‌పాద‌డ‌పా బాలీవుడ్లోనూ కొన్న పేరున్న చిత్రాల్లో ముఖ్య పాత్ర‌లు పోషించింది.

ఎలాంటి హీరోయిన్‌కైనా ఒక ద‌శ దాటాక పెద్ద సినిమాల్లో అవ‌కాశాలు తగ్గిపోతుంటాయి కానీ.. కాజ‌ల్‌కు మాత్రం అలాంటి ఇబ్బంది ఎదురు కాలేదు. హ‌ఠాత్తుగా పెళ్లి చేసుకుని బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌బోతున్న స్థితిలో కూడా ఆమె చేతిలో ఆచార్య‌, ఇండియ‌న్-2 సినిమాలున్నాయి.

ఐతే అనూహ్య ప‌రిస్థితుల్లో ఆచార్యలో ఆమె క్యారెక్ట‌ర్ని లేపేశారు. ఇండియ‌న్-2 మ‌ధ్య‌లో ఆగిపోయింది. ఆ టైంలోనే బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది కాజ‌ల్. ఇక ఆమె కెరీర్ ముగిసిన‌ట్లే అనుకున్నారు కానీ.. కాజ‌ల్ మాత్రం ఆశ‌లు వ‌దులుకోలేదు. త‌ల్లి అయిన కొన్ని నెల‌ల త‌ర్వాత తిరిగి సినిమాల్లోకి రావ‌డానికి స‌న్నాహాలు చేసుకుంది. ఇటీవ‌లే ఇండియ‌న్-2 ప‌ట్టాలెక్క‌డంతో ఆ సినిమాను పూర్తి చేయ‌డం అనివార్యం. దీంతో పాటు కొత్త సినిమాల్లోనూ న‌టించాల‌నుకుంటోందేమో.. అందుకోసం క‌స‌ర‌త్తులు మొద‌లుపెట్టింది చంద‌మామ‌.

తాజాగా ఆమె త‌న పున‌రాగ‌మ‌నాన్ని ఒక వీడియో ద్వారా వెల్ల‌డించింది. అందులో హార్స్ రైడింగ్ చేస్తూ క‌నిపించింది కాజ‌ల్. ఒక‌ప్పుడు త‌న ఎన‌ర్జీ లెవెల్స్ గొప్ప‌గా ఉండేవ‌ని, ఎంత క‌ష్ట‌మైనా ప‌డేదాన్న‌ని, రోజంతా షూటింగ్‌లో పాల్గొని కూడా త‌ర్వాత జిమ్‌కు వెళ్లేదాన్న‌ని, కానీ బిడ్డ‌ను క‌న్నాక శ‌రీరంలో మార్పులు చోటు చేసుకుని అంత క‌ష్ట‌ప‌డ‌లేక‌పోతున్నాన‌ని.. అయినా ప‌ట్టువిడవ‌కుండా క‌ష్ట‌ప‌డుతున్నానంటూ కాజ‌ల్ ఈ వీడియోతో పాటు ఒక ఎమోష‌న‌ల్ పోస్టు పెట్టింది. కాజ‌ల్ క‌ష్టం అర్థం చేసుకుని ఆమెకు మ‌నో ధైర్యాన్నిచ్చేలా కామెంట్లు పెడుతూ, వెల్కం బ్యాక్ అంటూ ఆమెకు స్వాగ‌తం ప‌లుకుతున్నారు అభిమానులు.