లైగ‌ర్.. ఇంకో రౌండుకు రెడీ

ఇండియాలో ఈ మ‌ధ్య కాలంలో సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా ట్రోలింగ్‌కు గురైన సినిమా ఏది అంటే.. మ‌రో మాట లేకుండా లైగ‌ర్ పేరు చెప్పేయొచ్చు. మామూలుగా అయితే ఎలా ఉండేదో కానీ.. ఈ సినిమా గురించి హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాథ్‌, నిర్మాత ఛార్మి విడుద‌ల‌కు ముందు ఇచ్చిన విప‌రీత‌మైన బిల్డ‌ప్ వ‌ల్ల.. రిలీజ్ అనంత‌రం సోష‌ల్ మీడియాకు బాగా టార్గెట్ అయిపోయారు.

విష‌యం వీక్‌గా ఉన్న‌పుడే పబ్లిసిటీ పీక్స్‌లో ఉంటుంద‌నే ఎమ్మెస్ నారాయ‌ణ డైలాగ్‌ను చిత్ర బృందం నిజం చేసిన‌ట్లు అనిపించింది. టీం చెప్పిన మాట‌ల‌కు, సినిమాలో విష‌యానికి అస‌లు పొంత‌న లేక‌పోవ‌డంతో మార్నింగ్ షోలు అవ్వ‌గానే లైగ‌ర్ సోష‌ల్ మీడియాకు, ట్రోల‌ర్ల‌కు టార్గెట్ అయిపోయింది. విప‌రీత‌మైన నెగెటివిటీ వ‌ల్ల ఆల్రెడీ బుక్ అయిన‌వి ప‌క్క‌న పెడితే.. కొత్త‌గా టికెట్లే తెగ‌లేదు. దీంతో వీకెండ్లోనే లైగ‌ర్ థియేట‌ర్లు వెల‌వెల‌బోయాయి.

వారాంతం అయ్యాక సినిమా అడ్ర‌స్ లేకుండా పోయింది. దీంతో విజ‌య్ దేవ‌ర‌కొండ స‌హా టీంలోని వాళ్లంతా సైలెంట్ అయిపోయారు. సోష‌ల్ మీడియా నెగెటివిటీ చూశాక సినిమాను ఆన్ లైన్లో, ఆఫ్ లైన్లో ప్ర‌మోట్ చేయ‌డానికి కూడా భ‌య‌ప‌డ్డారంటే ప‌రిస్థితి ఎలా త‌యారైందో అర్థం చేసుకోవ‌చ్చు. క‌ట్ చేస్తే.. ఇప్పుడు లైగ‌ర్ మ‌ళ్లీ వార్త‌ల్లోకి వ‌చ్చింది. ఈ సినిమా డిజిట‌ల్ ప్రిమియ‌ర్స్‌కు రంగం సిద్ధ‌మైంది.

ఈ నెల 22 నుంచి హాట్ స్టార్‌లో లైగ‌ర్ స్ట్రీమ్ కాబోతోంది. హాట్ స్టార్ స‌బ్‌స్క్రైబ‌ర్లంద‌రికీ ఫ్రీ కావడంతో అస‌లెందుకీ సినిమాకు ఇంత నెగెటిక్ టాక్ వ‌చ్చిందో, అంత‌గా ఎందుకు ట్రోల్ చేశారో తెలుసుకోవ‌డానికైనా జ‌నం ఈ సినిమాను బాగా చూస్తార‌న‌డంలో సందేహం లేదు. సినిమా చూసి మ‌రోసారి నెటిజ‌న్లు ఈ సినిమాపై ప‌డ‌డం ఖాయం. ఎంత త‌క్కువ అంచ‌నాల‌తో చూసినా సినిమా నిరాశ ప‌రిచే స్థాయిలో ఉంది కాబ‌ట్టి.. ఇంకో రౌండ్ ట్రోలింగ్ ఎదుర్కోవ‌డానికి విజ‌య్ అండ్ కో రెడీగా ఉండాల్సిందే.