ప్రమోషన్ల విషయంలో వెనుకబడి అభిమానులతో నానా చీవాట్లు తింటున్న గాడ్ ఫాదర్ టీమ్ ఎట్టకేలకు టెన్షన్లకు చెక్ పెట్టనుంది. అక్టోబర్ 5 విడుదల మీద ముసురుకున్న అనుమానాలు పూర్తిగా తీరిపోయాయి. 28న అనంతపూర్ లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసేందుకు ఏర్పాట్లు మొదలయ్యాయి. మూడు రోజుల నుంచి నానబెడుతూ విసిగించిన తార్ మార్ తక్కర్ మార్ లిరికల్ వీడియోని రేపు యూట్యూబ్ లో వదలబోతున్నారు. అక్కడి నుంచి తక్కువ గ్యాప్ లో బాలన్స్ ఉన్న మరో రెండు పాటలను కూడా విడుదల చేసేస్తారు. కమర్షియల్ సాంగ్స్ కాదు కాబట్టి నాన్చే అవసరం లేదు.
చేతిలో ఉన్న పదిహేను రోజులు పరుగులు పెట్టేందుకు పక్కా ప్రణాళిక సిద్ధమైనట్టు మెగా కాంపౌండ్ న్యూస్. ఫ్యాన్స్ ఆగ్రవేశాలు మొత్తానికి పైదాకా చేరుకున్నాయి. కంటెంట్ చాలా బాగా వచ్చిందని ఆ నమ్మకంతోనే పబ్లిసిటీ కొంత వెనుకబడినా సినిమా మాట్లాడుతుందనే నమ్మకంతో నిర్మాతలు దాన్ని సీరియస్ గా తీసుకోలేదని అంటున్నారు. ట్రైలర్ ని 25న లాంచ్ చేసే అవకాశాలున్నాయి. ఇవన్నీ అఫీషియల్ గా చెప్పలేదు కానీ వివిధ సోర్సెస్ నుంచి ఫ్యాన్స్ కు మీడియాకు ఇవి చేరిపోయాయి. ప్రస్తుతం వాల్తేర్ వీరయ్య షూట్ లో ఉన్న చిరు కొద్దిరోజూలు బ్రేక్ తీసుకోబోతున్నారు.
ముందు వెనుకా విపరీతమైన పోటీ నెలకొనడంతో గాడ్ ఫాదర్ కు పరిస్థితులన్నీ అంత అనుకూలంగా లేవు. స్ట్రాంగ్ బ్లాక్ బస్టర్ టాక్ రావాల్సిందే. పుకార్లకు చెక్ పెడుతూ హిందీ హక్కులు కొన్న ప్రొడ్యూసర్ సైతం దసరా రిలీజ్ ని కన్ఫర్మ్ చేశారు. 30న పొన్నియన్ సెల్వన్ 1, విక్రమ్ వేదా, 29న నేనే వస్తున్నా, గాడ్ ఫాదర్ వచ్చే రోజే ది ఘోస్ట్, స్వాతి ముత్యం వస్తున్న నేపథ్యంలో మెగా టాక్ ఓ రేంజ్ లో మారుమ్రోగిపోవాలి. ఆచార్య తాలూకు తీవ్ర విషాదాన్ని ఇది తగ్గించాలనే ఆశ అభిమానుల్లో కనిపిస్తోంది. దర్శకుడు మోహన్ రాజా, తమన్ రీ రికార్డింగ్ పనుల్లో యమా బిజీగా ఉన్నారు.