తమ సినిమాల ప్రి రిలీజ్ ఈవెంట్లకు వచ్చే పెద్ద హీరోలను యువ కథానాయకులు పొగడ్డం, ఎలివేషన్లు ఇవ్వడం మామూలే. ఐతే అల్లూరి మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా యంగ్ హీరో శ్రీ విష్ణు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు ఇచ్చిన ఎలివేషన్ ది బెస్ట్ అనే చెప్పాలి. ఏదో పొగడాలి అంటే పొగడాలి అని కాకుండా.. మనస్ఫూర్తిగా, జెన్యూన్ ఎమోషన్‌తో బన్నీ గురించి అతను చెప్పిన మాటలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి.
ఆ మాటలు వింటూ బన్నీ స్టేజ్ మీద ఒకింత భావోద్వేగానికి గురి కాక.. అభిమానులకు ఆ కామెంట్స్ గూస్ బంప్స్ ఇచ్చేశాయి. ఇండస్ట్రీలో కింది స్థాయి నుంచి ఎదిగే వాళ్లకు సాయం చేస్తానంటూ మాటలు చాలామంది చెబుతారని.. కానీ చేతల్లో చూపించడానికి దమ్ముండాలని.. బన్నీకి అది టన్నుల్లో ఉంది అంటూ తనకు బన్నీ చేసిన సాయాన్ని అతను గుర్తు చేసుకున్నాడు.
తాను ఇండస్ట్రీకి రెండు ఖాళీ చేతులతో వచ్చానని.. ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాతో నటుడిగా పరిచయం అయ్యాక కొన్ని రోజులకు బన్నీ రేసుగుర్రం చేస్తున్న సమయంలో తనను పిలిచి మాట్లాడినట్లు శ్రీ విష్ణు గుర్తు చేసుకున్నాడు. సినిమా అవకాశాలు వస్తున్నాయా అని అడిగి.. వచ్చిన సినిమానల్లా ఒప్పేసుకోకు అని బన్నీ తనకు చెప్పినట్లు శ్రీవిష్ణు వెల్లడించాడు.
అవకాశాలు వస్తుంటే చేయొద్దు అంటాడేంటి అని తాను ఆశ్చర్యపోయానని.. కానీ వచ్చే నాలుగైదేళ్లలో ఇండస్ట్రీ మొత్తం మారిపోతుందని.. కంటెంట్ ఉన్న, వైవిధ్యమైన సినిమాలే ఆడుతాయని, కాబట్టి కంటెంట్, క్వాలిటీ ఉన్న సినిమాలే చేయమని, లేదంటే ఖాళీగా ఉండమని బన్నీ అప్పుడే దూరదృష్టితో తనకు సలహా ఇచ్చినట్లు శ్రీవిష్ణు తెలిపాడు. మంచి కథ ఎంచుకుని, ఆ సినిమా చేయడంలో ఇబ్బంది ఉంటే తనను కలవాలనే, తనే ఆ చిత్రాన్ని నిర్మిస్తానని కూడా బన్నీ హామీ ఇచ్చాడని.. కానీ మంచి సినిమాలు చేసి తనేంటో రుజువు చేసుకున్నాకే బన్నీని కలవాలనుకున్నానని, అందుకే ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా తన దగ్గరికి వెళ్లలేదని, తనకు బన్నీ చెప్పిన మాటల్ని ఇప్పటికీ ప్రతి నిమిషం గుర్తు చేసుకుంటూనే ఉంటానని.. అందుకే బన్నీ మీద తన కృతజ్ఞతను ప్రతి సినిమాలో చూపిస్తున్నానని.. ఇన్నేళ్ల తర్వాత బన్నీని వెళ్లి తన సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్‌కు రమ్మంటే మరో ఆలోచన లేకుండా వచ్చి సాయం చేశాడని శ్రీ విష్ణు అన్నాడు.
ఇక బన్నీకి ఉన్న పాపులారిటీ గురించి చెబుతూ.. తాను సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో చిన్న పాత్ర చేస్తే.. శబరిమలకు వెళ్తే అక్కడ, లద్దాఖ్ వెళ్తే అక్కడ బన్నీ అభిమానులు గుర్తు పట్టి తన మీద ప్రేమ కురిపించారని శ్రీ విష్ణు గుర్తు చేసుకున్నాడు. వేరే హీరోలు పాన్ ఇండియా సినిమాల కోసం పెద్ద లెవెల్లో ప్లాన్ చేస్తారని.. కానీ బన్నీ తెలుగులోనే ఉండి పుష్ప మూవీ చేస్తే అది ఇండియాను షేక్ చేసిందని శ్రీ విష్ణు అదిరిపోయే ఎలివేషన్ ఇచ్చాడు.