కరోనా మహమ్మారి పుణ్యమా అని సినిమా రంగం పెద్ద సంక్షోభాన్నే ఎదుర్కొంది. కరోనా ప్రభావం తగ్గినా.. దాని తాలూకు ప్రతికూల ప్రభావం.. ఆ తర్వాత కూడా కొనసాగింది. ఒక దశలో జనాలు థియేటర్లకు రావడం బాగా తగ్గించేశారు. పెద్ద పెద్ద సినిమాలకు కూడా ఓపెనింగ్స్ రాని పరిస్థితి తలెత్తింది. ఇక చిన్న సినిమాలకైతే మెయింటైనెన్స్ ఖర్చులు కూడా రావడం గగనమైంది. ఆ దశలో ఇండస్ట్రీ ఒక్కసారిగా షేక్ అయిపోయింది.
కానీ గత నెలలో బింబిసార, సీతారామం, కార్తికేయ-2 చిత్రాలు మళ్లీ చిత్ర పరిశ్రమకు ఊపిరి పోశాయి. ఆ తర్వాత మళ్లీ పరిస్థితి మామూలే అన్నట్లు తయారైంది. గత నెల రోజుల్లో పూర్తి సంతృప్తినిచ్చి, బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్నందుకున్న సినిమా ఏదీ లేదనే చెప్పాలి. ఈ నేపథ్యంలో అల్లూరి సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా అల్లు అర్జున్ ఇండస్ట్రీలో మారిన పరిస్థితుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
“కరోనా తర్వాత సినిమాల గురించి అందరూ చాలా మాట్లాడుతున్నారు. చిన్న సినిమాలు వర్కవుట్ అవుతున్నాయి. చిన్న సినిమాలూ ఫెయిలవుతున్నాయి. పెద్ద సినిమాలు వర్కవుటవుతున్నాయి. పెద్దవీ ఫెయిలవుతున్నాయి. పెద్ద సినిమాలే వర్కవుటవుతాయి. చిన్నవి వర్కవుట్ కావు అనే ఫార్ములా ఏమీ లేదు. ఇప్పుడున్న ట్రెండ్ ఒకటే. పెద్ద సినిమా కాదు.. చిన్న సినిమా కాదు.. మంచి సినిమా. మంచి సినిమా ఉంటే జనాలు ఆదరిస్తున్నారు. సినిమా చిన్నదా పెద్దదా అని చూడట్లేదు. నిజానికి మనం మంచి ట్రెండ్లో ఉన్నాం. ఎవరూ ఏమీ భయపడాల్సిన పని లేదు. సినిమాలో కంటెంట్ ఉంటే చిన్నదా పెద్దదా అనే ఫరక్ పడదు. జనాలు అద్భుతంగా థియేటర్లకు వచ్చి సినిమాలు చూస్తున్నారు. ఇందుకు ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను” అని బన్నీ చెప్పాడు. ప్రస్తుత ట్రెండ్‌ను బన్నీ చాలా బాగా అర్థం చేసుకుని ఇండస్ట్రీకి భరోసానిచ్చే మాటలు చెప్పాడన్నది వాస్తవం.