చిరుతో పోటీపై నాగ్ ఏమ‌న్నాడంటే..

మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జునల స్నేహ బంధం గురించి ఇండ‌స్ట్రీ జ‌నాల‌కే కాదు.. ప్రేక్ష‌కుల‌కు కూడా బాగా తెలుసు. వారి మ‌ధ్య వ్య‌క్తిగ‌త స్థాయిలోనే కాక వ్యాపార ప‌రంగానూ బంధం ఉంది. అలాంటి మిత్రులు ఇప్పుడు బాక్సాఫీస్ సమరానికి సిద్ధమవ‌డం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. దసరా కానుకగా వీరి చిత్రాలు గాడ్ ఫాదర్, ది ఘోస్ట్ ముఖాముఖి తలపడబోతున్నాయి. రెండు చిత్రాలకు పండుగ‌ రోజైన అక్టోబరు 5నే రిలీజ్ డేట్ ఖరారైంది.

మ‌ధ్య‌లో ఈ సినిమాల మ‌ధ్య క్లాష్ ఉండ‌ద‌ని, డేట్లు మారుతున్నాయ‌ని ప్ర‌చారం జ‌రిగింది కానీ.. అలాంటిదేమీ లేద‌ని తేలిపోయింది. ఇరు చిత్రాల మేక‌ర్స్ అక్టోబ‌రు 5నే త‌మ సినిమాలు వ‌స్తాయ‌ని తాజాగా ధ్రువీక‌రించారు. ఐతే గత రెండు దశాబ్దాల్లో చిరు, నాగ్ ఇలా ముఖాముఖి తలపడిందే లేదు. మరి ఈ క్లాష్ క‌రెక్టేనా.. దీని వ‌ల్ల ఇద్ద‌రు మిత్రుల మ‌ధ్య ఇబ్బందిక‌ర వాతావ‌ర‌ణం నెల‌కొంటుందా అన్న చ‌ర్చ జ‌రుగుతోంది.

ఐతే ఈ క్లాష్‌ను ఇద్ద‌రూ ప్రొఫెష‌న‌ల్‌గానే చూస్తున్న‌ట్లున్నారు. చిరు ఇంకా మీడియా ముందుకు రాలేదు కానీ.. ఆయ‌న కంటే ముందు త‌న సినిమా ప్ర‌మోష‌న్ కోసం మీడియాను క‌లిసిన నాగ్.. చిరుతో క్లాష్ గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. చిరంజీవిని చాలామంది ఇష్ట‌ప‌డ‌తారు. మా ఇద్ద‌రి సినిమాల విడుద‌ల కోసం నేను ఆత్రుత‌గా ఎదురు చూస్తున్నాను. ఈ రెండు చిత్రాలు ఒకే రోజు రిలీజ‌వుతున్నాయి.

ద‌స‌రా స‌మ‌యంలో ఒకేసారి రెండు మూడు సినిమాలు విడుద‌ల కావ‌డం గ‌త 40 ఏళ్ల నుంచి ఆన‌వాయితీగా వ‌స్తోంది. సినిమా బాగుండాలి కానీ.. పోటీగా ఎన్ని చిత్రాలు విడుద‌లైనా ఆద‌ర‌ణ పొందుతుంది అని నాగ్ అన్నాడు. చిరుకు గాడ్ ఫాద‌ర్ స‌క్సెస్ ఎంత అవ‌స‌ర‌మో.. ది ఘోస్ట్ హిట్ కావ‌డం నాగార్జున‌కు అంతే అవ‌స‌రం. నాగ్ చివ‌రి సినిమా వైల్డ్ డాగ్ మంచి టాక్ తెచ్చుకుని కూడా క‌లెక్ష‌న్లు రాబ‌ట్ట‌లేక‌పోయింది. అంత‌కుముందు నాగ్ వ‌రుస‌గా డిజాస్ట‌ర్లు ఎదుర్కొన్నాడు. ది ఘోస్ట్‌ను గ‌రుడ‌వేగ ఫేమ్ ప్రవీణ్ స‌త్తారు రూపొందించాడు.