టాలీవుడ్లో స్టార్ హీరోలు ఏ సినిమా చేయాలన్నా తమ ఇమేజ్‌ను దృష్టిలో ఉంచుకుంటారు. ఫక్తు ప్రేమకథలు చేయాలంటే వారికి ఇమేజ్ అడ్డం వస్తుంది. హీరోకు ఎలివేషన్లు లేకుండా.. యాక్షన్ సన్నివేశాలకు స్కోప్ లేకుండా ఉండే ప్రేమకథలు చేయాలంటే వారికి కొంచెం ఇబ్బందే. ఇలాంటి అభిమానులకు అసలు రుచించవు. ఈ కారణంతోనే కావచ్చు.. సూపర్ స్టార్ మహేష్ బాబు ఏమాయ చేసావె లాంటి అందమైన ప్రేమకథను తిరస్కరించాడట.
మహేష్ ఏంటి.. ఏమాయా చేసావెకు నో చెప్పడం ఏంటి అనిపిస్తోందా? ఈ విషయాన్ని స్వయంగా గౌతమ్ మీననే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
గతంలో మహేష్ బాబు హీరోగా ఆయన సోదరి మంజుల నిర్మాణంలో మీరు ఓ సినిమా చేయాల్సింది కదా.. ఆ ప్రాజెక్టు ఏమైంది అని గౌతమ్‌ను అడిగితే.. ఆ సినిమా ఏమాయ చేసావెనే అని వెల్లడించాడతను. మహేష్ నో అనడంతోనే నాగచైతన్య హీరోగా ఆ సినిమా చేసినట్లు వెల్లడించాడు. ఐతే ఏమాయ చేసావె హృద్యమైన ప్రేమకథే అయినప్పటికీ.. మహేష్ ఇమేజ్‌కు అది సూటయ్యేది కాదన్నది వాస్తవం.
తమిళంలో ఇదే కథను శింబు చేశాడు. అతడికి కొంచెం స్టార్ ఇమేజ్ ఉంది కానీ.. మహేష్ రేంజ్ అతడితో పోలిస్తే చాలా ఎక్కువ. మరీ అంత క్లాస్ సినిమాలో, ఒక మామూలు కుర్రాడిలా కనిపించే పాత్రను మహేష్ చేస్తే అభిమానులు ఒప్పుకునేవారు కాదేమో. గౌతమ్ మీనన్‌తో మహేష్ సినిమా అంటే.. కాక్క కాక్క, వేట్టయాడు విలయాడు, ఎన్నై అరిందాల్ లాంటి యాక్షన్ బేస్డ్ కాప్ స్టోరీలైతేనే బాగుంటుందన్నది వాస్తవం.