ఈ మధ్య కాలంలో ప్రేక్షకులను తీవ్ర భావోద్వేగాలకు గురి చేసి.. వారిని వెంటాడిన సినిమా అంటే సీతారామం అనే చెప్పాలి. తెలుగులో ఇంత అందమైన, మంచి ఫీల్ ఉన్న, భావోద్వేగాలతో నిండిన ప్రేమకథ వచ్చి చాలా కాలం అయింది. బాక్సాఫీస్ దగ్గర డల్ నోట్‌తో మొదలైనప్పటికీ.. తర్వాత బలంగా పుంజుకుని కమర్షియల్‌గానూ పెద్ద విజయం సాధించిందీ చిత్రం.
ఈ సినిమాతో దర్శకుడు మను రాఘవపూడి పేరు మార్మోగిపోయింది. పడి పడి లేచె మనసు లాంటి డిజాస్టర్ తర్వాత అతణ్నుంచి ఇంత గొప్ప సినిమాను ఎవ్వరూ ఊహించలేదు. ఈ సినిమా రిలీజైన దగ్గర్నుంచి ప్రశంసల వర్షంలో తడిసి ముద్దవుతున్న హను.. కొన్ని విమర్శలు కూడా ఎదుర్కొన్నాడు. ఓ హాలీవుడ్ మూవీ స్ఫూర్తితో ఈ కథను అల్లుకున్నాడని, అలాగే కొన్ని సన్నివేశాను మల్లీశర్వి సినిమా నుంచి కాపీ కొట్టాడని నెటిజన్లు అంటున్నారు.
మల్లీశ్వరి సినిమాలో కూడా హీరోయిన్ ఒక ప్రిన్సెస్. ఆ విషయం ప్రేక్షకులకు తెలుస్తుంది కానీ.. హీరోకు తెలియదు. అతను తర్వాత విషయం తెలిసి ఆశ్చర్యపోతాడు. సీతారామంలో ప్రేక్షకులకు కూడా ఈ సంగతి తెలియదు. హీరోకు కూడా చివరి వరకు విషయం తెలియదు. ఇక హీరోయిన్ నేపథ్యం తెలియని హీరో తన జీతం ఇంత అని, తన దగ్గర ఉన్న డబ్బుతో ఇల్లు కట్టుకుందామని అంటాడు. మల్లీశ్వరిలో వెంకీ సైతం హీరోయిన్ యువరాణి అని తెలియక ఇలాగే తన జీతం గురించి గొప్పగా చెప్పి, ఇల్లు గురించి మాట్లాడతాడు. ఈ పోలికలతో వీడియోలు చేసి హను మీద కొందరు కౌంటర్లు వేస్తున్నారు. దీనికి హను స్వయంగా సమాధానం ఇచ్చాడు.
తాను యాదృచ్ఛికంగానే హీరోతో జీతం, ఇంటి గురించి డైలాగ్ అలా చెప్పించానని.. మల్లీశ్వరి సినిమా నుంచి కాపీ కొట్టాల్సిన అవసరం లేదని.. ఐతే అంత మంచి సినిమాతో పోల్చినందుకు తనకు సంతోషమే అని హను అన్నాడు. మరోవైపు ఈ చిత్రంలో కథానాయకుడి పాత్రకు రకరకాల పేర్లు అనుకుని చివరికి దుల్కర్‌ను ఎంచుకున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని హను ఖండించాడు. కథ రాసినప్పుడే రామ్ పాత్రకు అతణ్ని అనుకున్నట్లు స్పష్టం చేశాడు.