వర్షన్ మారింది…తేడా కొట్టింది

కొరియన్ కథలు తెలుగులో చాలానే వచ్చాయి. ఎక్కువ శాతం ఫ్రీ మేక్స్ అయితే ఓ బేబీ లాంటి అరా కొరా సినిమాలు రీమేకులుగా తీసుకొచ్చారు. తాజాగా ఓ కొరియన్ రీమేక్ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆ సినిమానే శాకిని డాకిని. నివేత థామస్ , రెజీనా ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన ఈ సినిమాను వర్షన్ మార్చి తెలుగులో తీశారు.

ఒరిజినల్ సినిమా మిడ్ నైట్ రన్నర్ లో ఇద్దరు హీరోలుంటారు. వారి ఇద్దరి మీదే కథ నడుస్తుంది. అయితే తెలుగుకి వచ్చేసరికి నిర్మాత సునీత దాన్ని ఇద్దరు హీరోయిన్స్ కథగా మార్చారు. ఇద్దరు హీరోలు అంటే కొంత సమస్య అనుకున్నారో లేదా లేడీ నిర్మాతగా దీన్ని ఫీమేల్స్ కథ ఎందుకు చేయకూడదు అనుకున్నారో మొత్తం మీద మార్చారు. కథలో హీరోయిన్స్ కి తగ్గట్టుగా కొన్ని మార్పులు చేసి ఈ రీమేక్ ను టాలీవుడ్ డైరెక్టర్ సుధీర్ వర్మ చేతిలో పెట్టారు. సినిమా షూట్ ఎండ్ కొచ్చేసరికి రిజల్ట్ అర్థమైందో ఏమో కానీ దర్శకుడు మెల్లగా సైడ్ అయిపోయాడు. తర్వాత ఆనంద్ రంగ అనే దర్శకుడితో సినిమాను పూర్తి చేయించారు.

ఇక సినిమాను బాగా నమ్మేసి రిలీజ్ కి ముందు రెజీనా , నివేథా గట్టిగా పొగిడేశారు. రెజీనా అయితే ఎదో గొప్ప సినిమా అన్నట్టుగా చెప్పుకుంది. మ్యాగీ అంటూ మగాళ్లను కామెడీ చేస్తూ అడల్ట్ జోకులు వేసి మరీ ప్రమోషన్స్ చేసి సినిమాను హైప్ చేసే ప్రయత్నం చేసింది. తీరా చూస్తే సినిమా రిజల్ట్ తేడా కొట్టేసింది. దీన్ని ఫీమేల్ వర్షన్ గా మార్చకుండా మేల్ వర్షన్ నే ఉన్నది ఉన్నట్టు తీసినా బాగుండేదని కొందరు విశ్లేషకుల భావన. అలాగే ఎవరైనా యంగ్ హీరోలు ను పెట్టి చేసి ఉంటే కాస్త కలెక్షన్స్ వచ్చేవి.