పెద్ద ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చిన యంగ్ హీరోలు చాలా వరకు మాస్ ఇమేజ్ కోసం వెంపర్లాడతారు. కానీ మెగా కుర్రాడు వరుణ్ తేజ్ మాత్రం అలాంటి ప్రయత్నం పెద్దగా చేసింది లేదు. పెద్ద మాస్ హీరో అవ్వడానికి తగ్గ కటౌట్ ఉన్నప్పటికీ.. కెరీర్లో చాలా వరకు క్లాస్ టచ్ ఉన్న, ప్రయోగాత్మక చిత్రాలే ఎక్కువ చేశాడు. అతను చేసిన రిస్కీ ప్రాజెక్టుల్లో అంతరిక్షం ఒకటి.
ఘాజీ సినిమాతో దర్శకుడిగా సత్తా చాటుకున్న సంకల్ప్ రెడ్డితో అతను చేసిన ఈ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. అయినా సరే.. ఆ దర్శకుడిని నమ్మి మరో సినిమా చేయడానికి అతను రెడీ అయ్యాడు. ఈ సినిమా గురించి తాజాగా హింట్ ఇచ్చారు.
వరుణ్ 13వ సినిమాగా తెరకెక్కనున్న ఈ చిత్రం గురించి ఈ నెల 19న అనౌన్స్‌మెంట్ రాబోతోంది. ఈ రోజు చిన్న టీజర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. ఇందులో దర్శకుడు, ఇతర వివరాలేవీ వెల్లడించకపోయినా.. ఈ సినిమాను డైరెక్ట్ చేయబోయేది సంకల్పేనట. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. సంకల్ప్ తొలి రెండు చిత్రాలు ఘాజీ, అంతరిక్షం తరహాలోనే దీన్ని కూడా ఇది కూడా అడ్వెంచరస్ సైన్స్ ఫిక్షన్ మూవీనే అట. ఈ రోజు రిలీజ్ చేసిన టీజర్ కూడా ఆ సంకేతాలే ఇచ్చింది.
ఇందులో ఒక యుద్ధ విమానం బొమ్మను చూపించారు. దీన్ని బట్టి హీరో ఫైటర్ జెట్ నడిపే పైలట్ అయి ఉంటాడని అంచనా వస్తోంది. వాస్తవ ఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుండడం విశేషం. కాబట్టి ఘాజీ తరహా ఇసనిమా అయి ఉండే అవకాశముంది.