కేవలం ఒకే హిట్టుతో యూత్ లో మంచి గుర్తింపుతో పాటు కుర్రాడు కష్టపడుతున్నాడనే అభిప్రాయం తెచ్చుకున్న కిరణ్ అబ్బవరంకు ఎస్ఆర్ కళ్యాణ మండపం ఇచ్చిన సక్సెస్ మొదట ఎంత ప్లస్ అయ్యిందో ఇప్పుడదే మైనస్ గానూ మారుతోంది. మాస్ ని మెప్పించాలనే తాపత్రయంతో పట్టుమని పది సినిమాలు దాటకుండానే ఆ వర్గాన్ని టార్గెట్ చేసుకుని ప్రేమకథలోనూ కమర్షియల్ ఎలిమెంట్స్ ని ఇరికించిన తీరు ముందు ముందు కొత్త సమస్యలు తెచ్చేలా ఉంది. కోడి రామకృష్ణ హోమ్ బ్యానర్ లో రూపొందిన నేను మీకు బాగా కావలసినవాడిని చూస్తే అదే అనిపిస్తోంది.
కిరణ్ లో మంచి ఎనర్జీ ఉంది. నిజమే. అలా అని ఓవర్ మాస్ గా చూపిస్తే ఆడియన్స్ అంత సులభంగా రిసీవ్ చేసుకోలేరు. ఎస్ఆర్ లోనూ చక్కగా ప్యాంటు చొక్కా వేసుకుని ఫైట్లు చేస్తాడు తప్పించి మరీ బాలయ్య, చిరంజీవి రేంజ్ లో లుంగీలు కట్టి గాగుల్స్ పెట్టుకుని రౌడీలను మట్టికరిపించడు. కానీ మీకు కావాల్సినవాడినిలో మాత్రం ఇవన్నీ ఓవర్ డోస్ అయ్యాయి. లవ్ స్టోరీకి ఫాదర్ సెంటిమెంట్ జోడించి ఇష్టం లేని పెళ్లి చేసుకోలేక పారిపోయే అమ్మాయిల మీద సందేశం ఇచ్చే పాయింట్ మీద రాసుకున్న కథ తెరమీద తేలిపోయింది. స్క్రీన్ ప్లే సంభాషణలు స్వయంగా రాసుకున్న కిరణ్ పెన్ను తడబడింది.
తన బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టు, ఫ్యాన్స్ తననుంచి ఆశిస్తున్న అంచనాలకు అనుగుణంగా కథలను ఎంచుకుంటే ఈజీగా హిట్లు కొట్టేయొచ్చు. అంతే తప్ప అన్నయ్య, నరసింహనాయుడు పాటల బిట్లను రీమిక్స్ కొట్టించినంత మాత్రాన మాస్ ఎగబడి చూసేయరు. సమ్మతమే టైంకే తనెంత డేంజర్ జోన్ లో ఉన్నాడో ఓపెనింగ్స్ హెచ్చరించాయి. ఇప్పుడు దీనికి మరింత తగ్గిపోయాయి. మెయిన్ సెంటర్స్ కొన్ని మినహాయించి మిగిలిన చోట్ల బుకింగ్స్ సోసోగానే ఉన్నాయి. పబ్లిక్ టాక్ ఒకవేళ బ్రహ్మాండంగా ఉంటే ఇంకోలా ఉండేది కానీఆ సూచనలు పెద్దగా కనిపించడం లేదు.