మెగాస్టార్ చిరంజీవి ఈ వేసవిలో ఆచార్య మూవీతో దారుణమైన అనుభవాన్ని మూటగట్టుకున్నారు. ఇప్పుడిక ఆయన ఆశలన్నీ గాడ్ ఫాదర్ మీదే నిలిచి ఉన్నాయి. మలయాళ బ్లాక్‌బస్టర్ లూసిఫర్ ఆధారంగా రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగువాడైన తమిళ దర్శకుడు మోహన్ రాజా రూపొందించాడు.
రీమేక్ కావడం వల్ల దీని మీద కొంత ఆసక్తి తక్కువగానే ఉంది. కాకపోతే మోహన్ రాజా రీమేక్ చిత్రాలను బాగా డీల్ చేస్తాడని, తన ముద్ర ఉండేలా చూసుకుంటాడనే పేరుంది. గత నెలలో రిలీజైన టీజర్ అయితే ఓకే అనిపించింది. విడుదలకు ఇంకో నెల రోజుల సమయమే ఉండగా.. ప్రమోషన్ల జోరు కొంచెం పెంచాల్సి ఉంది. త్వరలోనే ట్రైలర్ లాంచ్ అవుతుందని భావిస్తున్నారు.
ఈలోపు క్యారెక్టర్ పోస్టర్లతో పాటు పాటలు ఒక్కోటిగా లాంచ్ చేయడానికి రంగం సిద్ధం చేశారు. ముందుగా సత్యదేవ్ చేసిన జైదేవ్ పాత్రను ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఐతే ఈ పాత్రను ఆల్రెడీ టీజర్లో చూసేశాం. ఒరిజినల్లో టొవినో థామస్ చేసిన హీరో కజిన్ పాత్రను అతను చేసినట్లుగా కనిపిస్తోంది. ఐతే ఈ సినిమాలో విలన్ ఎవరన్నదే అంతుబట్టకుండా ఉంది. మాతృకలో వివేక్ ఒబెరాయ్ ఆ పాత్రలో అదరగొట్టాడు. టీజర్లో ఎక్కడా విలన్ ఎవ్వరన్నది చూపించలేదు.
ఈ చిత్రంలో సముద్రఖని నటిస్తున్నడంటే అతనే విలన్ అయి ఉంటాడనుకున్నారు. కానీ టీజర్లో ఆయన పోలీస్‌గా కనిపించాడు. కాబట్టి ఆయన మెయిన్ విలన్ కాదు. సత్యదేవ్ కజిన్ పాత్ర చేస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి కాబట్టి అతను కూడా విలన్ కాదు. అయినా చిరుకు విలన్‌గా సత్యదేవ్ అంటే సెట్ కాడు. వెయిట్ సరిపోదు. మరి ఈ చిత్రంలో ప్రతినాయక పాత్ర చేస్తోందెవరు అన్న సస్పెన్స్ ఎప్పుడు వీడుతుందో చూడాలి.