రామ్ గోపాల్ వర్మ పతనం ట్విట్టర్‌తోనే ప్రారంభం అయిందని చెప్పొచ్చు. అంతకుముందు వరకు తన పనేదో తాను చేసుకుంటూ ఉండేవాడు. మాటల కంటే చేతలే ఆయనేంటో రుజువు చేస్తుండేవి. ఎప్పుడైతే చేతలు తగ్గించి ట్విట్టర్లో, అలాగే మీడియా ఛానెళ్లలో మాటలు మాట్లాడ్డం మొదలుపెట్టాడో అప్పట్నుంచి ఆయన డీవియేట్ అయిపోయాడు.
తన చిత్రాల్లో విషయం తగ్గిపోతూ వచ్చింది. ఒక దశ దాటాక మరీ నాసిరకం సినిమాలు తీస్తూ తనకున్న విలువ మొత్తం పోగొట్టుకున్నాడు. ఈ మధ్య వర్మ తీస్తున్న సినిమాలను థియేటర్లకు వెళ్లి డబ్బులు పెట్టి చూడడం కాదు కదా.. ఆన్ లైన్లో ఫ్రీగా చూపిస్తామన్నా చూసేవాళ్లు లేరు. ఆయన సినిమాల ట్రైలర్లు చూడ్డానికి కూడా జనం ఆసక్తి చూపించట్లేదు. ఐతే వర్మకు మాత్రం తన పతనం గురించి ఏ పట్టింపూ లేదు. ఎప్పట్లాగే ట్విట్టర్లో కూర్చుని ఎవరినో ఒకరిని గిల్లడం ఆయనకు అలవాటైపోయింది.
ఎవరైనా ప్రముఖులు చనిపోయినపుడు కూడా వర్మ ఊరికే ఉండట్లేదు. ఏదో రకంగా వివాదం రాజేయడానికి చూస్తున్నాడు. తాజాగా కృష్ణంరాజు మరణం నేపథ్యంలోనూ వర్మ అదే పని చేస్తున్నాడు. ఇలాంటి దిగ్గజాలు చనిపోయినపుడు ఒక రోజు షూటింగ్ ఆపలేరా.. ఇదేనా వారికి మనం ఇచ్చే గౌరవం, నివాళి? సిగ్గు సిగ్గు అంటూ కామెంట్లు చేశాడు వర్మ ట్విట్టర్లో.
ఐతే నిజంగా ఇది బాధతో, ఆవేదనతో చేసిన ట్వీట్లు అయితే కాదు. బేసిగ్గా వర్మ నైజం ప్రకారం చూస్తే.. ఈ నివాళులు, గౌరవాల గురించి ఆయనకు అస్సలు పట్టింపు ఉండదు. అయినా ఇలా షూటింగ్ ఆపాలి.. గౌరవించాలి అని ట్విట్లు చేశాడంటే అది కేవలం వివాదం రాజేసి దాన్నుంచి చలి కాచుకోవడం తప్ప ఇంకోటి కాదు. వర్మ అభిప్రాయం సహేతుకంగానేఅనిపించొచ్చు కానీ.. ఆయన నుంచి ఈ డిమాండ్ రావడమే విడ్డూరం.
కచ్చితంగా మంచి ఉద్దేశంతో ఆయన ఈ ట్వీట్లు చేశాడని ఎవ్వరూ అనుకోరు. కేవలం దీని మీద కాంట్రవర్శీ క్రియేట్ చేసి తమాషా చూద్దామనే ఆయన ఇలా చేసి ఉంటాడని అందరూ ఏకాభిప్రాయంతో ఉన్నారు. అయినా కృష్ణంరాజు చనిపోయింది ఆదివారం. ఆ రోజు మామూలుగానే షూటింగ్స్ ఉండవు. అలాంటపుడు వర్మ ప్రత్యేకంగా ఇలా డిమాండ్ చేయడం, హీరోలను తప్పుబట్టడం విడ్డూరం కాక మరేంటి?