లైగర్ సినిమా విడుదలకు ముందు విజయ్ దేవరకొండ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ఈ సినిమా వసూళ్ల లెక్క రూ.200 కోట్లతో మొదలవుతుందని.. ఇండియాను ఈ చిత్రం షేక్ చేసేస్తుందని.. ఇలా పెద్ద పెద్ద స్టేట్మెంట్లే ఇచ్చాడు. కానీ తెరపై బొమ్మ చూసిన వాళ్లకు దిమ్మదిరిగిపోయింది. ఈ సినిమాకా ఇంత ఎలివేషన్ ఇచ్చాడంటూ విజయ్‌ని సోషల్ మీడియాలో మామూలుగా ఆడుకోలేదు జనాలు. రెండో రోజుకే లైగర్ థియేటర్లు వెలవెలబోయి సినిమా పెద్ద డిజాస్టర్ దిశగా అడుగులు వేయడంతో విజయ్ సైలెంట్ అయిపోయాడు. ఆన్ లైన్లో అసలు చప్పుడే లేదు. ఆఫ్ లైన్లోనూ విజయ్ పెద్దగా సందడి చేయలేదు.
ఐతే కొంచెం గ్యాప్ తర్వాత అతను మీడియా కళ్లకు చిక్కాడు. బెంగళూరులో సైమా పదో వార్షికోత్సవ వేడుకలకు విజయ్ హాజరయ్యాడు. ఈ సందర్భంగా అతణ్ని ఇబ్బంది పెట్టే ప్రశ్నలు అడగాలని చూసింది.
ఇందులో భాగంగా జనగణమన గురించి ఓ విలేకరి అడిగారు. లైగర్ తర్వాత పూరి-విజయ్ కాంబినేషన్లో తెరకెక్కాల్సిన ఈ సినిమాకు కొన్ని నెలల కిందట ఘనంగా ప్రారంభోత్సవం జరగడం తెలిసిందే. ఐతే లైగర్ డిజాస్టర్ కావడంతో ఈ సినిమా ఆగిపోయినట్లు జోరుగా వార్తలొస్తున్నాయి. కాకపోతే విజయ్ కానీ, పూరి కానీ అధికారికంగా ఈ సినిమాపై ఎలాంటి ప్రకటనా చేయలేదు.
ఈ నేపథ్యంలో విజయ్‌ని ఈ సినిమా గురించి అడిగితే అతను సమాధానం దాటవేశాడు. మనం వచ్చిన సైమా వేడుకలను ఎంజాయ్ చేయడానికి, దానికే పరిమితం అవుదాం అని అతను బదులిచ్చాడు. మామూలుగా తన ఫెయిల్యూర్ల గురించి విజయ్ మాట్లాడడానికి ఎలాంటి ఇబ్బందీ పడడు. ఇబ్బందికర ప్రశ్నలకు కూడా ఈజీగా ఆన్సర్ చేస్తాడు. అలాంటిది జనగణమన గురించి అడిగితే సమాధానం చెప్పలేక దాటవేయడం ఆశ్చర్యం కలిగించే విషయమే. లైగర్ ఎఫెక్ట్ అతడిపై ఏ స్థాయిలో పడిందో చెప్పడానికి ఇంతకంటే రుజువేం కావాలి?