టాలీవుడ్లో అజాత శత్రువు అనదగ్గ హీరోల్లో ప్రభాస్ ఒకడు. అందరితో కలివిడిగా ఉంటూ ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం అతనిది. బాహుబలి సినిమా తో ఇండియా లోనే బిగ్గెస్ట్ స్టార్ గా అవతరించినప్పటికీ అతడిలో కాస్తయినా అహంకారం కనిపించలేదు. ప్రభాస్ ఎదుగుదల చూసి కొందరికి అసూయ పుట్టి ఉండొచ్చు.
తన అభిమానులు కొంత అతి చేసి ఉండొచ్చు. కానీ ప్రభాస్ ను మాత్రం వేలెత్తి చూపే అవకాశమే లేదు. అందుకే అతను అందరి డార్లింగ్ అయ్యాడు. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే ప్రభాస్.. ఈ రోజు తన పెద్ద నాన్న కృష్ణం రాజు మరణంతో చిన్నపిల్లాడిలా ఏడుస్తూ ఉంటే చూసేవాళ్ళకి హృదయం ద్రవించి పోయింది. ముఖ్యంగా తన చెల్లిని ఓవైపు ఓదారుస్తూ.. మరోవైపు తాను కన్నీళ్లు పెట్టుకోవడం అందరినీ కలచివేసింది.
చాలా ఏళ్ళ నుంచి అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నప్పటికి కృష్ణంరాజు ఎప్పుడూ ఇన్ యాక్టివ్ గా లేరు. కొన్ని నెలల ముందు కూడా రాధేశ్యాం సినిమాలో కనిపించారు. వయసు మీద పడ్డప్పటికీ ఇలా యాక్టివ్ గా ఉన్న వ్యక్తి చనిపోవడం తీవ్రంగా బాధించే విషయమే. ఇక ప్రభాస్ తో ఆయనకున్న అనుబంధం గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. సినీరంగంలో అతన్ని నడిపించింది ఆయనే. ప్రభాస్ హీరో అయిన కొంతకాలానికి అతడి తండ్రి సూర్యనారాయణరాజు చనిపోయారు.
అప్పటి నుంచి ప్రభాస్ కు కృష్ణంరాజు అన్నీ తానై వ్యవహరించారు. ప్రభాస్ బాహుబలితో తిరుగులేని ఇమేజ్ సంపాదిస్తే పొంగిపోయారు. జీవితంలో అన్ని చూసిన ఆయనకు ప్రభాస్ పెళ్లి చూడకపోవడం ఒక్కటే లోటు. ఇప్పుడు ఆయన కోరిక తీర్చాల్సిన బాధ్యత ప్రభాస్ మీద ఉంది. అలాగే కృష్ణంరాజు మరణంతో కుటుంబ బాధ్యతను పూర్తిస్థాయిలో తీసుకోవాల్సిన అవసరం కూడా ఏర్పడింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates