పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు చేస్తున్న, చేయబోతున్న సినిమాల విషయంలో విపరీతమైన గందరగోళం నడుస్తోంది. ఆయన సినిమాల గురించి రోజుకో రూమర్ హల్‌చల్ చేస్తోంది. క్రిష్ దర్శకత్వంలో పవన్ నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ ఎప్పుడు పూర్తవుతుందో తెలియట్లేదు. దీని తర్వాత చేయాల్సిన హరీష్ శంకర్ సినిమా ‘భవదీయుడు భగత్ సింగ్’ విషయంలో ఎడతెగని జాప్యం జరుగుతోంది. సురేందర్ రెడ్డితో చేయాల్సిన సినిమా గురించి అసలు ఊసే లేదు.
ముందు అనౌన్స్ చేసిన ఈ సినిమాలన్నీ పక్కన పెట్టి సముద్రఖని దర్శకత్వంలో ‘వినోదియ సిత్తం’ అనే తమిళ చిత్ర రీమేక్‌లో పవన్ నటించబోతున్నట్లు కొన్ని నెలల కిందట వార్తలు రావడం తెలిసిందే. ఇందులో సాయిధరమ్ తేజ్ ఓ కీలక పాత్ర పోషిస్తాడని.. మార్చిలోనే సినిమా మొదలవుతుందని అప్పుడు వార్తలొచ్చాయి. కానీ అవి నిజం కాలేదు. తాజాగా సాహో దర్శకుడు సుజిత్ తో పవన్ సినిమా అంటూ గుసగుసలు వినిపించాయి.
అది ఎంతవరకు నిజమో కానీ పవన్ ప్రస్తుతానికి పక్కన పెట్టిన ‘వినోదియ సిత్తం’ హిందీలో రీమేక్ అయిపోవడం, విడుదలకు కూడా సిద్ధం కావడం విశేషం. అక్కడ ఈ చిత్రాన్ని థ్యాంక్ గాడ్ పేరుతో రీమేక్ దర్శకుడు ఇంద్ర కుమార్. ఒరిజినల్లో సముద్రఖని చేసిన దేవుడి పాత్రలో అజయ్ దేవగన్ నటించాడు. ఇక తమిళంలో తంబి రామయ్య చేసిన నడివయసు పాత్రను యువకుడిగా మార్చి సిద్ధార్థ్ మల్హోత్రాతో చేయించారు. తాజాగా సినిమా ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. ఒరిజినల్ తో పోలిస్తే సినిమా మరింత సరదాగా అల్లరిగా సాగేలా కనిపిస్తోంది.
ఈ నెల 24న థ్యాంక్ గాడ్ థియేటర్లలోకి దిగబోతోంది. తెలుగు రీమేక్ లో తంబి రామయ్య చేసిన నడివయసు పాత్రను యువకుడిగా మార్చి సాయి ధరమ్ తేజ్ తో చేయించాలన్నది త్రివిక్రమ్ ఐడియా అని చెప్పుకున్నారు. కానీ హిందీలో ఇదే ఐడియాను అమలు చేశారు. సినిమాను చకచక పూర్తిచేసి విడుదలకు కూడా సిద్ధం చేశారు. మరి తెలుగు రీమేక్ సంగతి ఏమవుతుందో?
Gulte Telugu Telugu Political and Movie News Updates