కెప్టెన్ ఎలా ఉందంటే

రేపు ప్యాన్ ఇండియా లెవెల్ లో బ్రహ్మాస్త్ర, రెండు భాషల్లో ఒకే ఒక జీవితం విడుదల ఉండటంతో వాటితో పోటీ ఎందుకని ఒక రోజు ముందే వచ్చిన సినిమా కెప్టెన్. ఆర్య హీరోగా నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మీద తెలుగులో అసలే మాత్రం అంచనాల్లేవ్. అంతో ఇంతో పెంచుదామని యూనిట్ ప్రత్యేకంగా హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసింది. ట్రైలర్ వచ్చినప్పుడు మూవీ లవర్స్ లో దీని గురించి మిశ్రమ స్పందన ఎదురయ్యింది. సరే కంటెంట్ తో ఏమైనా మెప్పిస్తారేమోనని కాస్తో కూస్తో థియేటర్ కు వెళ్లిన జనం లేకపోలేదు. వీళ్ళ టాక్ మీద సహజంగానే ఆసక్తి ఉంటుంది.

ఎప్పుడో 1987లో వచ్చిన ప్రిడేటర్ తరహా సినిమాలతో స్ఫూర్తి చెందిన దర్శకుడు శక్తి సౌందర రాజన్ ఈ కెప్టెన్ ని కూడా అచ్చం అదే తరహాలో రాసుకున్నాడు. సిక్కిం దగ్గరలోని సెక్టార్ 42 అనే అటవీ ప్రాంతానికి వెళ్లినవారెవరూ ప్రాణాలతో తిరిగి రారు. దీని వెనుక ఉన్న రహస్యమేంటో కనుక్కునేందుకు రంగంలోకి దిగుతాడు కెప్టెన్ విజయ్ కుమార్(ఆర్య). ఎంత జాగ్రత్తగా ఉన్నా స్నేహితుడి(హరీష్ ఉత్తమన్) ని పోగొట్టుకుంటాడు. అసలు ఈ హత్యల వెనుక ఉన్న వింత జీవులేంటి, ఎందుకవి ఇంతటి దారుణాలకు తెగబడ్డాయి, మన హీరోగారు వాటిని ఎలా మట్టుబెట్టారనేదే కెప్టెన్ కథ.

చిన్నప్పుడు విపరీతంగా నచ్చేసిన హాలీవుడ్ మూవీస్ ని సౌత్ ఆడియన్స్ మీద బలవంతంగా రుద్దే ప్రయత్నం మరోసారి చేశాడు సౌందర్ రాజన్. ఏ మాత్రం ఆకట్టుకోని కథాకథనాలతో కనీసం పిల్లలను సైతం మెప్పించలేనంత బ్యాడ్ స్క్రీన్ ప్లేతో టార్చర్ పెట్టేశాడు. రాకాసి ఏలియన్లు, వాటిని చంపేందుకు హీరో నడుం బిగించడం తాతలనాటి ఫార్ములా. ఒకపక్క వెబ్ సిరీస్, టీవీ సీరియల్స్ అద్భుతమైన గ్రాఫిక్స్ తో మెప్పిస్తుంటే ఇలాంటి అవుట్ డేటెడ్ ఆలోచనతో హీరోని నిర్మాతను ఒప్పించిన రాజన్ ప్రతిభను మెచ్చుకోవలసిందే. మితిమీరిన విదేశీ చిత్రాల పైత్యం కథగా మారితే ఇదిగో ఇలా కెప్టెన్ లా ఉంటుంది