కరోనా వైరస్ ఎఫెక్ట్ కారణంగా ‘ఓటీటీ రిలీజ్’ అనే పదం సోషల్ మీడియాలో తరుచుగా వినబడుతోంది. థియేటర్లు మూతబడడం, లాక్డౌన్ ఎత్తేసినా సినిమా హాళ్లు ఎప్పుడు తెరుచుకుంటాయనే క్లారిటీ లేకపోవడంతో ఓటీటీ రిలీజ్ గురించి పెద్ద డిస్కర్షన్ జరుగుతోంది. అయితే ఓటీటీ రిలీజ్ మాట చెబితే చాలు ఉలిక్కిపడుతున్నారు టాలీవుడ్ జనాలు. రాజ్ తరుణ్, రామ్, అనుష్క… ఇలా ఓటీటీ రిలీజ్‌ను ఖండిస్తున్నవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతూనే ఉంది.
నాని ‘వీ’, అనుష్క ‘నిశ్శబ్దం’, రామ్ ‘రెడ్’, రాజ్ తరుణ్ ‘ఓరేయ్ బుజ్జిగా’, రానా ‘అరణ్య’… ఇలా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుని రిలీజ్ వాయిదా పడిన తెలుగు సినిమాల సంఖ్య పెద్దగానే ఉంది. లాక్డౌన్ కారణంగా వీటి రిలీజ్‌పై సందిగ్ధత నెలకొంది. దాంతో వీటిలో కొన్ని సినిమాలను నేరుగా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో రిలీజ్ చేస్తారని టాక్ వినిపించింది.
‘రెడ్’ సినిమాపై ఇలాంటి వార్తలు వస్తే, హీరో రామ్ నేరుగా ట్విట్టర్ ద్వారా స్పందించి, ‘ఎంత లేట్ అయినా థియేటర్లలోనే రిలీజ్ చేస్తాం’ అంటూ క్లారిటీ ఇచ్చాడు. ‘ఓరేయ్ బుజ్జిగా’ సినిమా కూడా ఓటీటీ రిలీజ్ కాదంటూ స్పష్టం చేశాడు రాజ్ తరుణ్. ఇప్పుడు ‘నిశ్శబ్దం’ సినిమా నేరుగా ఓటీటీ రిలీజ్ కానుందంటూ వస్తున్న వార్తలపై నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు.
‘షూటింగ్ మొదలెట్టినప్పటి నుంచి అనుష్క శెట్టితో పాటు చిత్ర యూనిట్ మొత్తం ‘నిశ్శబ్దం’ కోసం చాలా కష్టపడిందని… ఇలాంటి అర్థం లేని రూమర్లను నమ్మవద్దంటూ’ కొట్టిపాడేశారు నిర్మాతలు. అయితే ఓటీటీ రిలీజ్ అంటే అంత పెద్ద తప్పేం కాదు అంటున్నారు విశ్లేషకులు. థియేటర్లలో రిలీజ్ అయితే ఆ సినిమా రిజల్ట్ ప్రేక్షకులు డిసైడ్ చేస్తారు.
ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో అయితే రిలీజ్‌కి ముందే డబ్బులు వస్తాయి. అదీగాక పరిస్థితులు ఎప్పుడు నార్మల్ అవుతాయో తెలియకుండా రిలీజ్ కోసం వెయిట్ చేయడం కంటే ఓటీటీ రిలీజ్ చేయడమే బెటర్ అనేది చాలామంది ఫీలింగ్. కాని మన సినిమా బాబులు మాత్రం, ధియటర్లో రిలీజ్ చేస్తేనే మాస్ లో క్రేజ్ వస్తుంది కాబట్టి, అదే కావాలని అంటున్నారు. అది సంగతి.