నందమూరి మూడో తరం వారసుడిగా మోక్షజ్ఞ ఎంట్రీ కోసం బాలకృష్ణ అభిమానులు ఎదురుచూసే కొద్దీ ఆలస్యమవుతూనే ఉంది. జూనియర్ ఎన్టీఆర్ ఆల్రెడీ సెటిలైనప్పటికీ బాలయ్య కొడుకుని తెరమీద చూసుకోవాలన్న ఫ్యాన్స్ ఆత్రం ఇప్పట్లో తీరే సూచనలు కనిపించడం లేదు. తన పుట్టినరోజు సందర్భంగా బయటికొచ్చిన ఫొటోల్లో బాడీ ఫిట్ నెస్ కోసం మోక్షజ్ఞ పెద్దగా కష్టపడుతున్నట్టు అనిపించలేదు. నిజంగా తనకు ఆసక్తి లేదా లేక మరికొన్నేళ్లు ఆగిచూద్దామని తండ్రే పెండింగ్ లో పెడుతూ వస్తున్నారో అర్థం కావడం లేదు. నేరుగా అడిగే సాహసం మాత్రం ఎవరూ చేయలేకపోతున్నారు.
నిజానికి మోక్షజ్ఞని టాలీవుడ్ కు పరిచయం చేయాలని కొన్నేళ్ల క్రితమే గట్టి ప్రయత్నాలు జరిగాయి. సాయి కొర్రపాటి నిర్మాణంలో రానే వచ్చాడు మా రామయ్య టైటిల్ తో తెరంగేట్రాన్ని ప్లాన్ చేసుకున్నారు. అదే సమయంలో తారక్ రామయ్య వస్తావయ్యా డిజాస్టర్ కావడంతో పేరు మారుద్దామనే ఆలోచన కూడా జరిగింది. కట్ చేస్తే ఆ ప్రాజెక్టు ముందుకు కదల్లేదు. మోక్షజ్ఞకు ఇంట్రస్ట్ లేదని, ఎవరి ఒత్తిడి కోసమో సినిమాల్లో నటించే ఉద్దేశం పెట్టుకోలేదని కొంత ప్రచారం జరిగింది కానీ నిజానిజాలేంటో ఆ కుటుంబానికే తెలియాలి.
కొన్ని నెలల క్రితం దర్శకుడు పూరి జగన్నాధ్ పేరు వినిపించింది. రామ్ చరణ్ ని చిరుతతో పర్ఫెక్ట్ గా లాంచ్ చేశాడు కాబట్టి మోక్షజ్ఞను కూడా తన చేతుల్లో పెట్టాలనే ప్రతిపాదన వచ్చిందట. పైసా వసూల్ తర్వాత పూరితో మరొకటి చేయాలన్న బాలయ్య కమిట్ మెంట్ ఈ రకంగా పూర్తి చేయొచ్చనే ఆలోచన కాబోలు. కానీ ఇప్పుడు లైగర్ ఫలితం చూశాక అలాంటి సాహసం చేస్తారని చెప్పలేం. ఏది ఏమైనా మోక్షజ్ఞను ఇండస్ట్రీకి తీసుకురావాలంటే వీలైనంత త్వరగా ఎంట్రీ చేయించడం మంచిది. ఎందుకంటే ఈ జెనరేషన్ మిస్ అయితే ఈ ఫ్యామిలీకి నాలుగో తరం మొదలవుతుంది