కామెడీని సీరియస్ గా తీసుకోవాలి

ప్రమోషన్ తో బాగా హంగామా చేసిన ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ సినిమా మొదటి ఆట పూర్తి కావడం ఆలస్యం.. పూర్తి నెగటివ్ టాక్ తో వారం గడవటం కూడా కష్టమనేలా ఉంది. ఇద్దరు కొత్త దర్శకులు బాధ్యతలు తీసుకున్నా రచన చేసిన అనుదీపే ప్రమోషన్లలో హైలైట్ అయ్యాడు. తనకొచ్చిన జాతిరత్నాలు బ్రాండ్ ని ఉపయోగించుకుని యూత్ ని, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని టార్గెట్ చేసి కాసింత బజ్ తెచ్చుకోవడంలో సక్సెస్ అయ్యాడు.

మాములు ఇంటర్వ్యూ ఇవ్వడానికే పదిసార్లు ఆలోచించే అల్లు అరవింద్ తో సరదా ముఖాముఖీ నిర్వహించడం అతనికే చెల్లింది. ఇదంతా ఒక్క రోజు సంబరంగా మొత్తం ఆవిరైపోయింది. అనుదీప్ లో మంచి కామిక్ సెన్స్ ఉంది నిజమే. కాదనలేం. అలా అని ప్రేక్షకులను టేకెన్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకోకూడదు. ఫస్ట్ డే ఫస్ట్ షో విషయంలో అతను కామెడీని సీరియస్ గా రాసుకుని ఉంటే ప్రేక్షకులు థియేటర్లలో నవ్వేవాళ్ళు.

అలా కాకుండా దాన్ని మరీ సిల్లీగా ట్రీట్ చేయడంతో రివర్స్ లో నవ్వులపాలయ్యే పరిస్థితి వచ్చింది. ఎంత పవర్ స్టార్ అయినా అతని మొదటి ఆట టికెట్ సంపాదించడమంటే అదేమీ ఎవరెస్ట్ ఎక్కడమంత రిస్క్ కాదు. అలాంటప్పుడు దాని చుట్టే ఇంతేసి కథనం నడిపిస్తే జనానికి విసుగు కాక ఇంకేమోస్తుంది. జాతిరత్నాలు సైతం ఓటిటిలో వచ్చాక సోషల్ మీడియా వేదికగా కొన్ని విమర్శలకు గురయ్యింది.

దీన్ని హాల్లో ఎలా చూశారాని అడిగిన నెటిజెన్లు ఉన్నారు. అక్కడ తప్పించుకున్నా ఇప్పుడీ FDFS దగ్గర అనుదీప్ దొరిపోయాడు. అసలే ప్రిన్స్ రాబోతోంది. తమిళంతో పెద్ద మార్కెట్ తో పాటు తెలుగులో డీసెంట్ ఇమేజ్ కలిగిన శివ కార్తికేయన్ హీరోగా చెప్పుకోదగ్గ బడ్జెట్ తోనే దీన్ని తీస్తున్నారు. తమన్ సంగీతం లాంటి స్ట్రాంగ్ టెక్నికల్ టీమ్ సపోర్ట్ ఉంది. దీన్ని ఎంతమేరకు అనుదీప్ వాడుకుంటాడో చూడాలి. అసలే నెక్స్ట్ వెంకటేష్ తో మూవీ ఉందన్న టాక్ వస్తోంది. అప్పుడెప్పుడో స్టార్లను డీల్ చేయడంలో మారుతీ చేసిన పొరపాట్లు అనుదీప్ రిపీట్ చేయకుంటే బెటర్.