ఒకప్పుడు పాత సినిమాలను రీ రిలీజ్ చేయడం ఒక ట్రెండుగా ఉండేది. సెకండ్ రిలీజ్‌లో కూడా వంద రోజులు ఆడిన సినిమాలు చాలానే ఉన్నాయి. 2000 ముందు వరకు ఈ ట్రెండ్ బాగా నడిచింది. కానీ తర్వాత పరిస్థితులు వేగంగా మారిపోయాయి. సినిమాలు 50, 100 రోజులు ఆడే రోజులు కనుమరుగయ్యాయి. కొత్త సినిమాలే రెండు మూడు వారాలు నిలవడం కష్టమవుతున్నపుడు, ఉన్న సినిమాలకు థియేటర్లు దొరకడం కష్టమైపోతున్నపుడు పాత సినిమాలను మళ్లీ థియేటర్లలోకి తీసుకురావడం మీద ఎవరు దృష్టిపెడతారు?
ఓటీటీల పుణ్యమా అని బోలెడంత కంటెంట్ అందుబాటులోకి వస్తున్నపుడు పాత సినిమాలను థియేటర్లలో ప్రదర్శిస్తే వెళ్లి చూసేదెవరు? అందుకే రీ రిలీజ్ అనే మాటే వినిపించడం మానేసింది. కానీ ఈ మధ్య పెద్ద హీరోల పుట్టిన రోజులకు వాళ్ల కెరీర్లలో బిగ్గెస్ట్ హిట్లుగా నిలిచిన, ఫ్యాన్ మూమెంట్స్ ఎక్కువగా ఉన్న సినిమాలను ప్రదర్శించడం ట్రెండుగా మారుతోంది. ఐతే ఆగస్టు ముందు వరకు ఇలాంటి షోలు పరిమిత సంఖ్యలోనే ఉండేవి.
కానీ ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టిన రోజును పురస్కరించుకుని రెండు రోజుల పాటు ‘పోకిరి’ సినిమా షోలు రికార్డు స్థాయిలో ప్రదర్శించారు. వరల్డ్ వైడ్ ఆ షోల సంఖ్య 370కి పైగానే కాగా.. కలెక్షన్లు రూ.1.7 కోట్ల దాకా వచ్చాయి. ఈ టార్గెట్ చూసి ఇంకెవరూ బ్రేక్ చేయలేరనే అనుకున్నారు. కానీ పవన్ ఫ్యాన్స్ ఈ ఛాలెంజ్‌ను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ‘జల్సా’ సినిమాకు భారీ లెవెల్లో ప్లానింగ్ చేశారు.
కొన్ని రోజుల ముందు వరకు చూస్తే ‘జల్సా’ నిజంగా రికార్డును కొడుతుందా అని సందేహాలు కలిగాయి కానీ.. సమయం దగ్గరపడేసరికి కథ మారిపోయింది. ఈ చిత్రానికి షోల సంఖ్య 500 దాటిపోయింది. టికెట్ల కోసం డిమాండ్ కూడా గట్టిగానే ఉండడంతో చాలా వరకు షోలు సోల్డ్ ఔట్ అయిపోయాయి. వసూళ్ల మోత మోగిపోయింది. రెండు తెలుగు రాష్ట్రాల వరకే ఈ చిత్రం రూ.1.3 కోట్ల దాకా గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇంకా బెంగళూరు, చెన్నై సిటీల్లోనే కాక యుఎస్‌లో సైతం పెద్ద సంఖ్యలోనే షోలు పడ్డాయి. మొత్తం లెక్కలు తీస్తే గ్రాస్ కలెక్షన్లు రూ.2 కోట్లను దాటి ఉంటాయని అంచనా. కాబట్టి ‘పోకిరి’ రికార్డు బద్దలైనట్లే అన్నమాట.