జ‌ల్సా ర‌చ్చ‌.. జాతిర‌త్నాలు డైలాగ్ ట్రెండింగ్

తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌స్తుతం రిలీజ‌వుతున్న కొత్త సినిమాల కంటే.. ఎప్పుడో 14 ఏళ్ల కింద‌ట విడుద‌లైన జ‌ల్సా సినిమా సంద‌డే ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. శుక్ర‌వారం ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ పుట్టిన రోజును పుర‌స్క‌రించుకుని.. గురువారం ఉద‌యం నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున జ‌ల్సా స్పెష‌ల్ షోల‌ను ప్ర‌ద‌ర్శిస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఇప్ప‌టిదాకా రీ రిలీజ్‌లో ఏ సినిమాకూ లేనంత అత్య‌ధిక స్థాయిలో షోలు న‌డుస్తున్నాయి ఈ చిత్రానికి. గ‌త నెల‌లో మ‌హేష్ బాబు పుట్టిన రోజు సంద‌ర్భంగా పోకిరి స్పెష‌ల్ షోలు భారీ స్తాయిలో ప్లాన్ చేయ‌గా.. దాన్ని టార్గెట్ చేసుకుని ఇంకా పెద్ద సంఖ్య‌లో ఈ సినిమాకు షోలు ప్లాన్ చేశారు. వాటికి రెస్పాన్స్ కూడా మామూలుగా లేదు. హైద‌రాబాద్ స‌హా అన్ని మేజ‌ర్ సిటీల్లోనే కాక టౌన్ల‌లో కూడా భారీగా స్పెష‌ల్ షోలు హౌస్ ఫుల్స్‌తో ర‌న్ అవుతున్నాయి.

ఇదే స‌మ‌యంలో గ‌త ఏడాది బ్లాక్‌బ‌స్ట‌ర్ అయిన కామెడీ మూవీ జాతిర‌త్నాలులోని ఒక డైలాగ్ సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ చిత్రంలో ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ‌.. న‌వీన్ పొలిశెట్టిని ఉద్దేశించి నువ్వు మాకోసం ఏం చేశావ్ రా అని అడుగుతారు. అందుకు అత‌ను బ‌దులిస్తూ.. ఏం చేయ‌లేదారా మీకోసం నేను, 2008 మార్చి 27 న‌ట‌రాజ్ థియేట‌ర్, సంగారెడ్డి. జ‌ల్సా సిన్మా రిలీజ్ ఆ రోజు.. నేను పైన బాల్క‌నీలో ఉన్నా.

మీరు కింద 10 రూపాయ‌ల టికెట్లో ఉన్నారు. పైకి తీస్క‌రాలేదారా నేను మిమ్మ‌ల్ని ఆ రోజు. నా నేచ‌ర్ రా అది అని అంటాడు న‌వీన్. ఇప్ప‌డు 14 ఏళ్ల త‌ర్వాత ఓ కొత్త సినిమా త‌ర‌హాలో తెలుగు రాష్ట్రాల్లో జ‌ల్సా సంద‌డి చేస్తుండ‌డంతో న‌వీన్ జాతిర‌త్నాలు థియేట‌ర్లో ఈ స‌న్నివేశానికి వ‌చ్చిన రెస్పాన్స్‌ను చూపిస్తూ ఒక వీడియో షేర్ చేశాడు. అంతే కాక అమేజాన్ ప్రైమ్ వాళ్లు సైతం ఈ డైలాగ్‌ను కోట్ చేస్తూ పోస్టు పెట్టారు. ప‌వ‌న్ క్రేజ్‌కు ఇది నిద‌ర్శ‌నం అంటూ నెటిజ‌న్లు ఈ పోస్టుల‌ను వైరల్ చేస్తున్నారు.