పూరి కొంచెం ఎఫర్ట్ పెట్టుంటేనా..

‘లైగర్’ సినిమా టాలీవుడ్ చరిత్రలోనే అతి పెద్ద డిజాస్టర్లలో ఒకటని తేలిపోయింది. రూ.90 కోట్లకు థియేట్రికల్ హక్కులను అమ్మితే ఫుల్ రన్లో అందులో మూడో వంతు షేర్ కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదంటే ఇది ఎంత పెద్ద డిజాస్టరో అర్థం చేసుకోవచ్చు. నైజాంలో రూ.22 కోట్ల షేర్ వస్తే కానీ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేని సినిమాకు తొలి వీకెండ్లో ఆరు కోట్ల కంటే తక్కువ షేర్ వచ్చింది. సోమవారం నుంచి సినిమా డెఫిషిట్లో నడుస్తుండడంతో ఇక కొత్తగా యాడ్ అయ్యే షేర్ అంటూ ఏమీ లేనట్లే.

అంటే అక్కడ రికవరీ 25 శాతం మాత్రమే అన్నమాట. విడుదలకు ముందు మంచి హైప్ తెచ్చుకుని, అడ్వాన్స్ బుకింగ్స్‌లో దూకుడు చూపించిన సినిమాకు మరీ ఇంత కనీస స్థాయిలో వసూళ్లు రావడం షాకింగే. ఇందుకు పూర్తిగా బాధ్యత వహించాల్సింది పూరి జగన్నాథ్ మాత్రమే. విజయ్ లాంటి హీరో చేతిలో ఉండగా ఆయనేమీ అద్భుతాలు చేయాల్సిన అవసరం లేదు. ఓ మోస్తరు సినిమా తీసి ఉన్నా కూడా ఫలితం వేరేలా ఉండేది.

‘లైగర్’ సినిమా గురించి ఇటు విజయ్, అటు పూరి మరీ ఎక్కువ చెప్పడం ద్వారా ఓవర్ హైప్ తీసుకురావడమే కొంపముంచింది. ఆ హైప్ అడ్వాన్స్ బుకింగ్స్‌కు బాగా ఉపయోగపడింది. తొలి రోజు సినిమాకు భారీ వసూళ్లే వచ్చాయి. కానీ ఎంతో ఊహించుకుని సినిమాకు వెళ్తే.. అక్కడ బొమ్మ పూర్తిగా తిరగబడి కనిపించింది. నిజానికి సినిమా ఒక దశ వరకు బాగానే అనిపిస్తుంది. హీరో రింగ్‌లోకి దిగే వరకు ఆసక్తికరంగానే అనిపిస్తుంది. కానీ హీరోయిన్ ఎంటరవగానే పక్కదారి పడుతుంది. ఇక ఆ తర్వాత ఏ దశలోనూ ట్రాక్ ఎక్కలేదు. అంతకంతకూ పేలవంగా తయారై, భరించలేని విధంగా తయారవుతుంది. కచ్చితంగా పూరి ఒక గొప్ప అవకాశాన్ని మిస్ చేసుకున్నాడనే చెప్పాలి.

హీరోయిన్‌గా అనన్య పాండే స్థానంలో ఇంకొకరిని పెట్టి, ఆ పాత్రను కొంచెం ఆసక్తికరంగా తీర్చిదిద్దుకుని.. మైక్ టైసన్ ఎపిసోడే తీసేసి, హీరోను వెనక్కి లాగే సీరియస్ విలన్ని పెట్టి సినిమాను నడిపించి ఉంటే ‘లైగర్’ ఇంత దారుణంగా ఉండేది కాదు. పాస్ మార్కులు వేయించుకునేది. సినిమా ఓ మోస్తరుగా ఉండుంటే.. దానికున్న హైప్‌కి బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు చేసుండేది. ‘లైగర్’ ఇంత పేలవంగా ఉండి కూడా నార్త్ ఇండియాలో మాస్ ప్రేక్షకులు ఒక మోస్తరుగా దాన్ని ఆదరిస్తున్నారు. అలాంటిది సినిమా బాగుంటే కచ్చితంగా బాక్సాఫీస్ దగ్గర మోత మోగేదే.