అన్న, బావలతో మెగా కుర్రాడి మల్టీస్టారర్!

నటుడిగా నిలదొక్కుకుని, అపార అనుభవం సంపాదించాక కూడా దర్శకత్వం గురించి అడిగితే.. వామ్మో అని అంటారు చాలామంది. హీరోల్లో దర్శకత్వం జోలికి వెళ్లే వాళ్లు చాలా కొద్దిమంది మాత్రమే. ఇక యంగ్ హీరోలు ఎవరినైనా డైరెక్షన్ గురించి అడిగితే.. దండం పెట్టేస్తారు. కానీ మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా అరంగేట్రం చేసి ‘ఉప్పెన’ భారీ విజయాన్నందుకున్న పంజా వైష్ణవ్ తేజ్ మాత్రం భవిష్యత్తులో తాను కచ్చితంగా దర్శకత్వం చేస్తానంటున్నాడు. తాను ఎవరితో సినిమా తీసేది కూడా అతను ఇప్పుడే చెప్పేయడం విశేషం.

తన అన్నయ్య సాయిదరమ్ తేజ్, బావ వరుణ్ తేజ్‌ల కలయికలో తాను మల్టీస్టారర్ మూవీ తీస్తానని అతను పేర్కొన్నాడు. తన కొత్త చిత్రం ‘రంగ రంగ వైభవంగా’ ప్రమోషన్లలో భాగంగా మీడియాను కలిసిన సందర్భంగా వైష్ణవ్ ఈ మేరకు తన ఆసక్తిని తెలియజేశాడు. తనకు దర్శకత్వం మీద ఆసక్తి ఉందని, మరింత అనుభవం సంపాదించాక కచ్చితంగా భవిష్యత్తులో దర్శకుడిగా మారతానని వైష్ణవ్ చెప్పాడు.

‘శంకర్ దాదా జిందాబాద్‌’ బాల నటుడిగా కీలక పాత్ర పోషించిన వైష్ణవ్.. హీరో కావడానికి ముందు దర్శకత్వ విభాగంలో పని చేశాడు. ఆ తర్వాత నటనలో శిక్షణ పొంది ‘ఉప్పెన’తో హీరోగా అరంగేట్రం చేశాడు. ఏదో నామమాత్రంగా దర్శకత్వ విభాగంలో పని చేయడం కాకుండా.. దర్శకుడయ్యే ఆలోచనతో వర్క్ నేర్చుకున్నాడన్నమాట ఈ మెగా కుర్రాడు. మెగా ఫ్యామిలీ హీరోల మల్టీస్టారర్ల గురించి తరచుగా చర్చ జరుగుతుంటుంది కానీ.. అవేవీ కూడా సాధ్యపడట్లేదు.

సాయిధరమ్, వరుణ్‌ల కాంబినేషన్లో సినిమా గురించి కూడా ఇంతకు ముందు వార్తలొచ్చాయి. మరి నిజంగా వైష్ణవ్.. వీరి కలయికలో సినిమా తీస్తాడేమో చూడాలి. ఆ సంగతి పక్కన పెడితే.. మంగళవారం జరిగే ‘రంగ రంగ వైభవంగా’ ప్రి రిలీజ్ ఈవెంట్‌కు సాయిధరమ్, వరుణ్‌లే ముఖ్య అతిథులుగా రాబోతుండడం విశేషం. ‘అర్జున్ రెడ్డి’ తమిళ వెర్షన్ దర్శకుడు గిరీషయ్య రూపొందించిన ఈ చిత్రం ఈ శుక్రవారమే థియేటర్లలోకి దిగుతోంది.