నాగ్ కొడితే.. దీంతోనే కొట్టాలి

అక్కినేని నాగార్జున కెరీర్ ఎన్న‌డూ లేనంత డౌన్‌లో ఉందిప్పుడు. గ‌త ఏడాది ఆయ‌న్నుంచి వ‌చ్చిన వైల్డ్ డాగ్ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుని కూడా మూడున్న‌ర కోట్ల షేర్‌కు ప‌రిమితం అయింది. అప్పుడు కొవిడ్ సెకండ్ వేవ్ కొంత ప్ర‌తికూల ప్ర‌భావం చూపి ఉండొచ్చు కానీ.. అయినా స‌రే ఆ సినిమాకు వ‌చ్చిన వ‌సూళ్లు మ‌రీ క‌నీసం అనే చెప్పాలి. ఇక ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన నాగ్ కొత్త సినిమా బంగార్రాజు.. సోగ్గాడే చిన్నినాయ‌నాకు సీక్వెల్ కావ‌డం వ‌ల్ల‌, ఆ టైంలో పెద్ద‌గా పోటీ లేక‌పోవ‌డం వ‌ల్ల ఓ మోస్త‌రు వ‌సూళ్లు సాధించి బ‌య‌ట‌ప‌డింది కానీ.. అది కూడా నాగ్ స్థాయికి త‌గ్గ హిట్ కాదు.

ఇలాంటి టైంలో నాగ్ నుంచి ది ఘోస్ట్ అనే మూవీ వ‌స్తోంది. గ‌రుడ‌వేగ‌తో అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసిన ప్ర‌వీణ్ స‌త్తారు రూపొందించిన సినిమా ఇది. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ ద‌గ్గ‌ర్నుంచి ప్రేక్ష‌కుల్లో ప్ర‌త్యేక ఆస‌క్తి రేకెత్తిస్తోంది. ఇంత‌కుముందు రిలీజ్ చేసిన టీజ‌ర్, ఇందులో హీరో వాడే ఆయుధం గురించి స్పెష‌ల్‌గా లాంచ్ చేసిన ఇంకో టీజ‌ర్, తాజాగా విడుద‌లైన ట్రైల‌ర్ అన్నీ కూడా చాలా ఎగ్జైటింగ్‌గా ఉన్నాయి.

గ‌త కొన్నేళ్ల‌లో ఏ నాగ్ సినిమా రేకెత్తించ‌ని స్థాయిలో ది ఘోస్ట్ మీద ఇంట్రెస్ట్ క్రియేట‌వ‌డానికి ప్ర‌వీణ్ స‌త్తారు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయ‌డం, ప్రోమోలు అంత ఆక‌ర్ష‌ణీయంగా ఉండ‌డం కార‌ణం. నాగ్ కూడా ఈ సినిమాతో త‌న‌కు పున‌ర్వైభ‌వం వ‌స్తుంద‌ని ఆశిస్తున్నాడు. ద‌స‌రాకి మెగాస్టార్ చిరంజీవి సినిమా గాడ్ ఫాద‌ర్ కూడా రిలీజ‌వుతున్నా స‌రే.. ధీమాగా ఎదురెళ్ల‌డానికి రెడీ అయ్యాడు.

ఈ సినిమా మీద చాలా ఆశ‌ల‌తో ఉన్న నాగ్.. ఇది రిలీజ‌య్యే వ‌ర‌కు కొత్త సినిమా గురించి ఆలోచించకూడ‌ద‌ని అనుకుంటున్నాడు. అందుకే విడుద‌ల‌కు 40 రోజుల ముందే ట్రైల‌ర్ లాంచ్ చేశాడు. ఇక్క‌డి నుంచి పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌క్కాగా చేసుకుని, ఫ‌స్ట్ కాపీ ప‌క‌డ్బందీగా తీసి, ప్ర‌మోష‌న్లు కూడా బాగా చేసుకుని విడుద‌ల‌కు వెళ్లాల‌నుకుంటున్నాడు. మ‌ళ్లీ ఒక పెద్ద హిట్ సాధించ‌డానికి నాగ్‌కు ది ఘోస్ట్ కంటే మంచి ఛాన్స్ లేద‌నే చెప్పాలి.