నైజాం‌కి కొత్త కింగ్ అవుతాడనుకుంటే..

నైజాం ఏరియాలో సుదీర్ఘ కాలంగా డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజుదే ఆధిపత్యం. రెండు దశాబ్దాలుగా ఆయన హవా నడుస్తోంది ఇక్కడ. నిర్మాతగా భారీ విజయాలు సాధించి పెద్ద రేంజికి వెళ్లాక కూడా ఆయన డిస్ట్రిబ్యూషన్‌ను వదిలిపెట్టలేదు. సినిమాల ఫలితాలను సరిగ్గా అంచనా వేసి సరిగ్గా పెట్టుబడులు పెట్టడం ద్వారా మోస్ట్ సక్సెస్ ఫుల్ డిస్ట్రిబ్యూటర్‌గా కొనసాగుతున్నాడు. ఐతే ఆయన ఆధిపత్యాన్ని సవాలు చేస్తూ దూసుకొచ్చిన కొందరు డిస్ట్రిబ్యూటర్లు.. కొన్ని రోజులు మాత్రమే దూకుడు చూపించి తర్వాత సైడ్ అయిపోతున్నారు.

రాజులా విజయాలు సాధించలేక మరుగున పడుతున్నారు. గతంలో అభిషేక్ నామా కొంత కాలం ఇలాగే జోరు చూపించాడు. దిల్ రాజును మించి పెద్ద సినిమాలకు భారీ ఆఫర్లు ఇచ్చి హక్కులు సొంతం చేసుకోవడం ద్వారా ఆయనకు చెక్ పెట్టేలా కనిపించాడు. సినిమాల నిర్మాణంలోనూ కొంతకాలం జోరు చూపించాడు. కానీ నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా వరుస ఎదురు దెబ్బలు తగలడంతో ఆయన కనుమరుగైపోయాడు.

అభిషేక్ నామా తర్వాత రాజును డైరెక్ట్‌గా సవాలు చేసిన వ్యక్తి వరంగల్ శీను. రాజుకు దీటుగా కొన్ని పెద్ద సినిమాల హక్కులు దక్కించుకున్న అతను.. ఒక సినిమాకు సంబంధించి చాలినన్ని థియేటర్లు ఇవ్వట్లేదంటూ ప్రెస్ మీట్ పెట్టి మరీ రాజు మీద తీవ్ర స్థాయిలో విమర్శలు, ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అతడి దూకుడు చూస్తే నైజాం‌కి కొత్త కింగ్ అవుతాడేమో, రాజుకు చెక్ పెడతాడేమో అని అంతా అనుకున్నారు. కానీ కొన్ని నెలల వ్యవధిలో రెండు గట్టి ఎదురు దెబ్బలు తగలడంతో వరంగల్ శీను ఉనికే ప్రశ్నార్థకం అయ్యేలా కనిపిస్తోంది. వేసవిలో ఆయన భారీ రేటు పెట్టి కొన్న ‘ఆచార్య’ పెట్టుబడిలో నాలుగో వంతు ఆదాయం మాత్రమే తెచ్చిపెట్టింది.

కొంత మేర సెటిల్ చేసినా కూడా శీనుకు భారీ నష్టమే మిగిలింది. ఆ దెబ్బ నుంచి తనను ‘లైగర్’ బయట పడేస్తుందని ఆశించాడు శీను. సినిమాకు మంచి క్రేజ్ రావడంతో ఏకంగా రూ.22 కోట్లు పెట్టి నైజాం హక్కులు తీసుకున్నాడు. కానీ ఈ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. తొలి రోజు నైజాంలో ఈ చిత్రం రూ.4.25 కోట్ల షేర్ రాబట్టింది. ఇది డీసెంట్ షేరే అయినా.. ఇప్పుడొచ్చిన టాక్‌తో రూ.22 కోట్ల టార్గెట్ అందుకోవడం చాలా చాలా కష్టం. అందులో సగం వస్తే ఎక్కువ అన్నట్లుంది పరిస్థితి. లైగర్ కొట్టే దెబ్బతో ఇక శీను కోలుకోవడం కష్టమే అంటున్నారు ట్రేడ్ పండిట్లు.