పూరి జగన్నాథ్-విజయ్ దేవరకొండల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన ‘లైగర్’ సినిమా అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. సినిమాకు ఉన్న హైప్ ప్రకారం చూస్తే ఓ మోస్తరుగా ఉన్నా సరే ఇరగాడేసేది. కానీ రొటీన్ కథాకథనాలతో సినిమాను పూరి నిస్సారంగా తయారు చేయడంతో ప్రేక్షకులు తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నారు. విడుదలకు ముందు సినిమాకు ఎంత బాగా హైప్ క్రియేట్ అయిందో.. ఇప్పుడు అంతే వేగంగా నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అవుతోంది.
దీన్ని తట్టుకుని సినిమా ఏమాత్రం నిలబడుతుందో అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఈ సినిమా ఫలితమేంటో తెలియగానే అందరి దృష్టి పూరి-విజయ్ కాంబినేషన్లో అనౌన్స్ అయిన మరో చిత్రం ‘జనగణమన’ మీదికి మళ్లింది. ఈ సినిమా భవిష్యత్ ఏంటన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. అనౌన్స్‌మెంట్‌కు మాత్రమే పరిమితమై, షూటింగ్ ఏమీ చేయని నేపథ్యంలో ఈ చిత్రాన్ని ఆపేసినా ఆశ్చర్యం లేదేమో అన్న సందేహాలు కలుగుతున్నాయి.
‘జనగణమన’ చర్చ ఈనాటిది కాదు. ఎన్నో ఏళ్ల నుంచి ఈ సినిమా గురించి చెబుతున్నాడు పూరి. మహేష్ బాబుతో ఈ సినిమా చేయాలన్నది ఆయన ఉద్దేశం. కానీ పూరి ఫాం కోల్పోవడం వల్లో ఏమో అతను ఈ సినిమా చేయలేదు. ఇక అది అటకెక్కేసినట్లే అనుకున్నారు. కానీ ‘ఇస్మార్ట్ శంకర్’తో మళ్లీ హిట్ కొట్టి విజయ్ దేవరకొండను ‘లైగర్’కు కమిట్ చేయించిన పూరి.. ఆ చిత్రం పూర్తవుతున్న దశలో ‘జనగణమన’కూ ఒప్పించాడు.
హడావుడిగా ఆ సినిమా అనౌన్స్‌మెంట్ కూడా భారీ హంగామా మధ్య జరిగింది. ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా వదిలారు. ‘లైగర్’ రిలీజయ్యే లోపే ఈ సినిమా షూటింగ్ కూడా కొంత పూర్తి చేస్తారని అనుకున్నారు కానీ.. విజయ్ దీన్ని పక్కన పెట్టి ‘ఖుషి’ని పట్టాలెక్కించాడు. కొంత షూటింగ్ చేసేస్తే ఈ సినిమాను పూర్తి చేయక తప్పని స్థితిలో విజయ్ ఉండేవాడు. కానీ పూరి ఏ ఉద్దేశంతో ఈ సినిమాను హడావుడిగా ప్రకటించాడో కానీ, విజయ్ తెలివిగానే దాన్ని హోల్డ్ చేసి ‘ఖుషి’ని మొదలుపెట్టాడు.
ఇప్పుడు కట్ చేస్తే ‘లైగర్’కు డిజాస్టర్ టాక్ వచ్చింది. దీంతో ‘జనగణమన’ మీద అనుమానాలు ముసురుకున్నాయి. ఇలాంటి ఫలితం తర్వాత పూరిని నమ్మి విజయ్ ‘జనగణమన’ చేయడం ఆత్మహత్యాసదృశ్యమే అన్న అభిప్రాయాలు అతడి అభిమానులు, శ్రేయోభిలాషుల నుంచి వినిపిస్తున్నాయి. మరి విజయ్ ఏం నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.