బాగా భయపెట్టేసిన టీవీ యాక్టర్లు!

మళ్ళీ షూటింగ్ మొదలు పెట్టాలని హడావిడి చేసిన సినిమా దర్శకులు, నిర్మాతలు కూడా ఇప్పుడు చప్పుడు చేయడం లేదు. కరోనా విజృంభిస్తున్న టైంలో షూటింగ్ లాంటి గ్రూప్ ఆక్టివిటీ చేస్తే ఏమవుతుందో టీవీ యాక్టర్ల ద్వారా తెలిసొచ్చింది.

టీవీ రంగంలో ప్రముఖ నటులు ఈ మహమ్మారి బారిన ఒక్కొక్కరుగా పడుతున్నారు. ఇరవై మంది బృందంతో జాగ్రత్తలు పాటించిన చోటే వైరస్ పాకిపోయింది. దీంతో కాస్త రిస్క్ చేద్దామని ఆలోచన ఉన్న సినిమా నటులు కూడా బాగా భయపడిపోయారు. జులైలో కొన్ని సినిమాలు మొదలు పెట్టాలని అనుకున్నారు. కానీ జూన్ లో జులై నుంచి ఓకే అని చెప్పిన హీరోలు కూడా ఇప్పుడు రాలేమని నిర్మాతలకు స్వయంగా కాల్ చేసి చెప్పేశారట.

అవసరమైతే నష్టాల్లో భాగం పంచుకుంటామని, రెమ్యూనరేషన్ లో కొంత తగ్గించుకుంటామని, అంతే తప్ప కోరి కోరి కరోనాతో తల గోక్కోలేమని చేతులు ఎత్తేశారట. దీంతో భారీ సినిమాల మాట అటుంచి చిన్న సినిమాలు మొదలు పెట్టాలని, ఓటిటీ కోసం కంటెంట్ రెడీ చేయాలని అనుకున్న వాళ్ళు కూడా కరోనా స్లో అయ్యాక చూసుకుందామని పనులు ఆపేసారు.