అవసరం లేని రచ్చలో అనసూయ

యాంకర్ గా కెరీర్ దివ్యంగా కొనసాగిస్తూనే రంగస్థలం నుంచి ఇప్పటిదాకా మరోపక్క సినిమాలు కూడా చేసుకుంటూ పోతున్న అనసూయ ట్విట్టర్ లో ఎంత యాక్టివ్ గా ఉంటుందో తెలియంది కాదు. అయితే కొన్నిసార్లు పెట్టే ట్వీట్లు వివాదాస్పదం కావడం, వాటికి అభిమానులు మద్దతు నిలవడం, యాంటీ ఫ్యాన్స్ కౌంటర్లు వేయడం చాలాసార్లు జరిగింది. ఒకదశలో సోషల్ మీడియాలో ఉండనంటూ గుడ్ బై చెప్పేసి మళ్ళీ తిరికి వెనక్కు రావడం ఎవరూ మర్చిపోలేరు. తాజాగా పోస్ట్ చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

అమ్మను అన్న ఉసురు ఊరికే పోదు, కర్మ కొన్నిసార్లు లేట్ అవ్వొచ్చేమో కానీ రావటం మాత్రం పక్కా అంటూ మెసేజ్ పెట్టడం పెద్ద చర్చకే దారి తీసింది. ఇది దేని గురించో అర్థం కాక కొందరు బద్దలు కొట్టుకుంటే మరికొందరు లైగర్ కు వచ్చిన నెగటివ్ టాక్ ని లింక్ చేస్తూ ఇది విజయ్ దేవరకొండకు వేసిన పంచ్ గా అభివర్ణిస్తున్నారు. అర్జున్ రెడ్డి టైంలో అతను ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అన్న ఒక ద్వందార్థపు మాటను ఫంక్షన్ కు వచ్చిన వాళ్ళతో కూడా చెప్పించడం అప్పట్లో సంచలనం. దాన్ని వ్యతిరేకిస్తూ అనసూయ అన్న మాటలు  చాలా వైరల్ అయ్యాయి.

అలా అని అనసూయ చేసింది కరెక్టేనని అందరూ అనటం లేదు. ఒకపక్క జబర్దస్త్ లాంటి డబుల్ మీనింగ్ కామెడీ రియాలిటీ షోలు చేస్తూ ఇలా కో ఆర్టిస్టుల సినిమాలకు ఫ్లాప్ టాక్ వచ్చినప్పుడు ఇలా టైం చూసుకుని అనడం సరికాదని మరికొందరి వాదన. ఏది ఏమైనా దీని మీద హాట్ డిబేట్స్ కామెంట్ల రూపంలో జరుగుతున్నాయి. మళ్ళీ దానికి బదులుగా అనసూయ ట్వీట్లు పెడుతూనే ఉంది కానీ మొత్తానికి ఇండస్ట్రీలోనే ఉంటూ అవసరం లేని రచ్చను ఈ సమయంలో చేయడం ఏమిటనే ప్రశ్నకు సమాధానం దొరకడం కష్టమే.