తమిళ్ రాకర్స్.. సౌత్ ఇండియాలో ఏ కొత్త సినిమా రిలీజైనా కొన్ని గంటల్లో పైరసీ ప్రింట్ ప్రత్యక్షమయ్యే వెబ్ సైట్. గతంలో కొత్త సినిమాలను పైరసీ చేసి సీడీలేసి అమ్మేది ఈ సంస్థ. టెక్నాలజీ పెరిగాక వెబ్ సైట్ ద్వారా వ్యవహారం నడిపించింది. దీని అడ్మిన్స్ ఎక్కడో విదేశాల్లో ఎవరికీ దొరక్కుండా సర్వర్ మెయింటైన్ చేస్తూ.. కొత్త సినిమాలను పైరసీ చేస్తుంటారు. ఈ వెబ్ సైట్‌ను నియంత్రించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది.
ఆ వెబ్ సైట్‌ను నిషేధిత జాబితాలో పెట్టి అది పని చేయకుండా చేసినా.. తన సబ్‌స్క్రైబర్లకు మెయిల్ ద్వారా పైరసీ లింక్స్ పంపిస్తూ.. ఈ బిజినెస్‌ను విజయవంతంగా నడిపిస్తున్నారు. ప్రధానంగా తమిళ సినిమాల మీదే ఈ సంస్థ ఫోకస్ ఉంటుంది కానీ.. వేరే భాషల చిత్రాలను కూడా పైరసీ చేసి ఇంటర్నెట్లో పెట్టేస్తుంటుంది ఈ సంస్థ. కోలీవుడ్ దీన్ని మూయించడానికి చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు.
కానీ దానికి బ్రేక్ మాత్రం పడలేదు. కాగా ఇప్పుడు తమిళ్ రాకర్స్ పైరసీ వ్యవహారం మీద అరుణ్ విజయ్ ప్రధాన పాత్రలో అరివళగన్ ఈ సిరీస్‌ను రూపొందించాడు. సోనీ లివ్ దీన్ని స్ట్రీమ్ చేస్తోంది. ఐతే తాము చేసే పైరసీ వ్యవహారాల చుట్టూ తిరిగే వెబ్ సిరీస్‌ను సైతం తమిళ్ రాకర్స్ వాళ్లు విడిచిపెట్టలేదు. ఈ సిరీస్ రిలీజైన కొన్ని రోజులకే పైరసీ ప్రింట్ రెడీ చేసేశారు. దాన్ని తమ సబ్‌స్క్రైబర్లందరికీ పంపించేశారు. ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.
దీని మీద బోలెడన్ని మీమ్స్, జోక్స్ కనిపిస్తున్నాయి సామాజిక మాధ్యమాల్లో. ఈ థ్రిల్లర్ సిరీస్‌లో ఇదే అసలైన ట్విస్టు, ఇది యాంటీ క్లైమాక్స్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. తమిళ ఇండస్ట్రీని తమిళ్ రాకర్స్ ఏ రకంగా వేధిస్తోందో చెప్పడానికి ఇంతకంటే రుజువు లేదు. ఇక ఈ వెబ్ సిరీస్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే వస్తోంది. మరీ గొప్ప థ్రిల్లింగ్‌గా లేకపోయినా.. ఎంగేజింగ్‌గానే ఉందని.. ఎనిమిది ఎపిసోడ్లలో ఒక రెండు తగ్గించి ఉంటే క్రిస్ప్‌గా మారేదని అంటున్నారు.