కార్తికేయ.. ఎన్ని కావాలంటే అన్ని

టాలీవుడ్లో సీక్వెల్స్ అంటేనే బెంబేలెత్తిపోయే పరిస్థితి ఉండేది మొన్నటిదాకా. సూపర్ హిట్, బ్లాక్‌బస్టర్ చిత్రాలకు కొనసాగింపుగా సినిమాలు చేసినపుడల్లా చేదు అనుభవాలే ఎదురయ్యాయి. గాయం, శంక‌ర్ దాదా, చంద్రముఖి, మంత్ర, కిక్, ఆర్య‌, వెన్నెల, గ‌బ్బ‌ర్ సింగ్, మ‌న్మ‌థుడు.. ఈ సినిమాలన్నింటికీ సీక్వెల్స్ వచ్చాయి. బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ఈ మధ్య ‘ఎఫ్-2’ సినిమాకు కూడా కొనసాగింపుగా ఫ్రాంఛైజీ ఫిలిం చస్తే అది కూడా వర్కవుట్ కాలేదు.

ఈ నేపథ్యంలో ఎనిమిదేళ్ల కిందటి ‘కార్తికేయ’ సినిమాకు సీక్వెల్ రెడీ అయ్యేసరికి అందరూ దాని వైపు అనుమానంగా చూశారు. నెగెటివ్ సెంటిమెంట్ ఈ సినిమాను కూడా కాటేస్తుందేమో అన్న ఆందోళన కనిపించింది. కానీ ఈ ఆందోళనను పటాపంచలు చేస్తూ ‘కార్తికేయ-2’ అనూహ్యమైన విజయాన్ని అందుకుంది. ఈ చిన్న సినిమాకు ఎంత పాజిటివ్ టాక్ వచ్చినా రూ.30-40 కోట్ల మధ్య వసూళ్లు వస్తే గొప్ప అనుకున్నారు.

కానీ ఈ చిత్రం ఇప్పుడు రూ.100 కోట్ల క్లబ్బు వైపు పరుగులు పెడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో, అలాగే యుఎస్‌లో దుమ్ముదులుపుతూనే.. నార్త్ ఇండియాలో అసాధారణ వసూళ్లు సాధిస్తోంది. హిందీలో 50 షోలతో మొదలై 3 వేలకు పైగా షోలతో రన్ అవడం అంటే మామూలు విషయం కాదు. అక్కడి జనాలకు సినిమా బాగా ఎక్కేస్తోంది. హిందూ ప్రో సినిమాలకు అక్కడి బ్రహ్మరథం పడుతున్న పడుతున్న సమయంలో రిలీజ్ కావడం ‘కార్తికేయ-2’కు బాగా కలిసొస్తోంది.

మొత్తంగా సినిమా భారీ విజయాన్నందుకోవడంతో ‘కార్తికేయ’ను చాలా పెద్ద ఫ్రాంఛైజీగా మార్చుకోవడానికి అవకాశం దక్కింది. నిఖిల్-చందూ మొండేటిల ప్రయాణం ఇంతటితో ఆగేది కాదు. కార్తికేయ పాత్రను పట్టుకుని కనీసం ఇంకో రెండు సినిమాలు తీయడానికి ఆస్కారముంది. ఆ క్యారెక్టర్, థీమ్ మాత్రమే కొనసాగిస్తూ ఎన్ని కొత్త కథలైనా చేసుకోవడానికి ఆస్కారం ఇచ్చింది ‘కార్తికేయ-2’. కాబట్టి తెలుగులో మోస్ట్ సక్సెస్ ఫుల్ ఫ్రాంఛైజీగా ‘కార్తికేయ’ చరిత్రలో నిలిచిపోవడం ఖాయం.