కిక్కు రావడం లేదు ఫాదర్

షూటింగ్ దాదాపు పూర్తి చేసుకున్న గాడ్ ఫాదర్ టీజర్ ని ఈ నెల 21న విడుదల చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటిదాకా వచ్చిన రెండు మూడు పోస్టర్లు కానీ, చిన్న క్యారెక్టర్ ఇంట్రో వీడియో కానీ ఏవీ ఆశించిన కిక్ ఇవ్వడం లేదు. అది డిజైనర్ లోపమా లేక కావాలని టీమ్ అలా అడిగి చేయించుకుంటుందో ఫ్యాన్స్ కి అర్థం కావడం లేదు. ఆచార్య దారుణ అవమానం తర్వాత మళ్ళీ మెగాస్టార్ రేంజ్ ఏంటో చూపాలన్నది అభిమానుల అభిమతం. కానీ గాడ్ ఫాదర్ కు సంబంధించి అలాంటి జోష్ ఇచ్చే ప్రమోషనల్ మెటీరియల్ ఇప్పటిదాకా బయటికి రాలేదు.

సల్మాన్ క్యామియో చేయడాన్ని నార్త్ ఆడియన్స్ కి ఇంకా రిజిస్టర్ చేయలేదు. నయనతార ఫ్యాక్టర్ ని తమిళ వెర్షన్ కోసం ఉపయోగించుకోవచ్చు. అదీ జరగడం లేదు. తమన్ మ్యూజిక్ తాలూకు మేజిక్ ని శాంపిల్ గా అయినా వదల్లేదు. ఒకవేళ దసరా విడుదలకు ప్లాన్ చేసుకున్నది నిజమే అయితే పబ్లిసిటీ వేగంతో పాటు అందులో మంచి క్రియేటివిటీ చూపించాల్సిన అవసరం చాలా ఉంది. అసలే లూసిఫర్ రీమేక్ కాబట్టి పోలికల విషయంలో చాలా అనుమానాలున్నాయి. వాటిని బద్దలు కొట్టాల్సిన బాధ్యత అదనం.

దేన్నీ టేకెన్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకునే పరిస్థితి లేదు. చిరంజీవి ఉంటే చాలు కదా అనుకోవడానికి ఇది 1990 కాదు. కొత్త జనరేషన్ యూత్  సీనియర్ హీరోలను చూసే కోణం వేరుగా ఉంటోంది. వాళ్ళను ఆకట్టుకోవాలంటే తెరవెనుక చాలా కసరత్తు జరగాలి. మరి దర్శకుడు మోహన్ రాజా ఏదైనా డిఫరెంట్ స్ట్రాటజీ అనుకుంటున్నాడేమో తెలియదు. అసలే పండక్కు నాగార్జున ది ఘోస్ట్ రెడీ అవుతోంది. రెండు చిన్న సినిమాలు స్వాతి ముత్యం, అన్నీ మంచి శకునములే కూడా ఫిక్స్ అయ్యాయి. సో గాడ్ ఫాదర్ మిస్సవుతున్నదేధో గుర్తించి ఆ దిశగా వెంటనే అడుగులు వేసేయాలి.