టాలీవుడ్ కొత్త నిర్ణయాలు

గత రెండు వారాలకు పైగా బందులో ఉన్న టాలీవుడ్ నిర్మాతలు ఎట్టకేలకు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆల్రెడీ ఒప్పందాలు చేసుకున్న వాటిని మినహాయించి ఇకపై మొదలయ్యే ఏ సినిమా అయినా ఓటిటి గ్యాప్ ఖచ్చితంగా ఎనిమిది వారాలు ఉండాలని ఫిక్స్ చేశారు. ఆ మేరకు దిల్ రాజు స్వయంగా ప్రకటించారు. ఇక్కడ చిన్నా పెద్దా తేడా లేదు. అన్నింటికీ ఒకే రూల్ వర్తింపజేయబోతున్నారు. అంటే ఏ కొత్త సినిమా అయినా సరే డిజిటల్ ప్రీమియర్ చూడాలంటే రాబోయే రోజుల్లో కనీసం రెండు నెలలు ఎదురుచూడాలన్న మాట

ఇది కఠినంగా అమలైతే మంచిదే. కానీ ఫ్లాప్ అయిన వాటికి జనం తిరస్కరించిన చిత్రాలకు ఇదే రూల్ పెట్టడం వల్ల నిర్మాతకొచ్చే అదనపు ఆదాయంలో కోత పడటం ఖాయం. ఇకపై ఓటిటిలు కూడా తాము ఆఫర్ చేసే మొత్తాన్ని గణనీయంగా తగ్గించుకుంటాయి. ఇది ఒకరకంగా త్యాగం లాంటిదే. బ్లాక్ బస్టర్లకు ఈ ఇబ్బంది ఉండదు. ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ లు లేట్ గా వచ్చినా ఓటిటి ఫ్యాన్స్ ఎంజాయ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా బాగా రిసీవ్ చేసుకున్నారు. కానీ ఇదే రెస్పాన్స్ అన్నిటికి ఆశించలేం. ఓ ఆరేడు నెలలు టెస్ట్ చేశాక ఇంకాస్త స్పష్టత వస్తుంది.

ఇక మల్టీ ప్లెక్సుల్లో ప్రీమియం సింగల్ స్క్రీన్లలో సామాన్యులకు భారంగా మారిన తిండిపదార్థాలు విషయంలోనూ తగ్గింపులు ఉండేలా రికమండేషన్లు చేయబోతున్నారు. ఇదీ మంచి పరిణామమే. టికెట్ కన్నా రెట్టింపు ధరతో పాప్ కార్న్ కొనాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. మా అసోసియేషన్ తో ఆర్టిస్టుల రెమ్యునరేషన్లు అదనపు ఖర్చుల గురించి కూడా అగ్రిమెంట్ చేసుకున్నారు. దానికి సంబంధించిన వివరాలు రావాలి. కార్మికుల జీతాల పెరుగుదలకు సానుకూల స్పందన వచ్చినట్టు తెలిసింది. అన్నీ దాదాపుగా కొలిక్కి వచ్చేశాయి కాబట్టి ఇంకో వారంలోపే షూటింగులు పునఃప్రారంభం కాబోతున్నాయి. చూడాలి ఈ కొత్త మార్పులు ఎలాంటి ట్రెండ్ కి దారి తీస్తాయో