మళ్లీ ఐదు షోల కళ తెస్తున్న లైగర్

వేసవి తర్వాత టాలీవుడ్లో భారీ చిత్రాల సందడి లేకపోయింది. ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్-2, ఆచార్య, సర్కారు వారి పాట లాంటి పెద్ద సినిమాలకు రెండు తెలుగు రాష్ట్రాల్లో అర్లీ మార్నింగ్ షోలు పడ్డాయి. పది రోజుల పాటు రోజుకు అయిదు షోల చొప్పున నడిపించుకునేందుకు వాటికి అనుమతి దక్కింది. ఈ అవకాశాన్ని ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్-2 సినిమాలు బాగా ఉపయోగించుకున్నాయి. చివరగా ఇలా రోజుకు ఐదు షోలు పడ్డ సినిమా అంటే ‘ఎఫ్-3’నే.

దానికి కూడా పెద్ద సంఖ్యలో ఏమీ స్పెషల్ షోలు వేయలేదు. వేసిన షోలకు కూడా సరైన స్పందన లేదు. ఆ తర్వాత ఐదు షోలు డిమాండ్ చేసే స్థాయి సినిమాలు రాలేదు. మేజర్, విక్రమ్, బింబిసార, సీతారామం, కార్తికేయ-2 మంచి విజయం సాధించినప్పటికీ.. వాటికి అదనపు షోలు వేయాల్సినంత అవసరం అయితే కనిపించలేదు. బింబిసార, కార్తికేయ-2లకు మాత్రం పరిమిత సంఖ్యలో కొన్ని అర్లీ షోలు పడ్డాయి.

ఐతే వచ్చే వారం విడుదల కానున్న ‘లైగర్’ మళ్లీ ఐదు షోల సందడి తీసుకురాబోతోంది. ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో వారం పది రోజుల పాటు రోజుకు ఐదు షోలు నడిపించుకునేందుకు అనుమతులు కోరబోతున్నారు. రెండు చోట్లా అనుమతులు రావడం లాంఛనమే కావచ్చు. ఐతే గతంలో ఇలా ఐదు షోలు నడిచిన పెద్ద సినిమాలకు టికెట్ల రేట్లు అదనంగా పెంచుకున్నారు. ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్-2 వరకు అది వర్కవుట్ అయింది కానీ.. తర్వాత వచ్చిన ఆచార్య, సర్కారు వారి పాట చిత్రాలకు ఇది మైనస్ అయింది.

ఆపై వచ్చిన చిత్రాలకు అదనంగా రేట్లు పెంచడం పక్కన పెడితే తెలంగాణ మల్టీప్లెక్సుల్లో రూ.295, సింగిల్ స్క్రీన్లలో రూ.175-200 రేటు కూడా భారంగా మారింది. ఫుట్ ఫాల్స్ బాగా తగ్గిపోయాయి. బింబిసార, సీతారామం, కార్తికేయ-2 చిత్రాలకు రీజనబుల్ రేట్లు పెట్టడం బాగా ప్లస్ అయింది. ‘లైగర్’ వీటితో పోలిస్తే పెద్ద సినిమా. క్రేజ్ కూడా బాగుంది. అలా అని అత్యాశకు పోతే ఎదురు దెబ్బ తప్పకపోవచ్చు. కాబట్టి పై చిత్రాల మాదిరే దీనికీ రీజనబుల్‌గా సింగిల్ స్క్రీన్లలో రూ.150, మల్టీప్లెక్సుల్లో రూ.200 రేటు పెడితే మాస్‌కు సినిమా బాగా రీచ్ అవుతుంది. ఫుట్ ఫాల్స్ ఎక్కువ ఉంటాయి. టాక్ బాగుంటే సినిమాకు లాంగ్ రన్ కూడా ఉంటుంది. మరి చిత్ర బృందం ఏం చేస్తుందో చూడాలి.